విశాఖపట్టణం.. సాగరతీరం.. చుట్టూ కొండలు. సాయంత్రమైతే సరదాగా అలలు చేసే సవ్వడి. ఓ వైపు నౌకాశ్రయం.. మరోవైపు ఉక్కుఫ్యాక్టరీ.. సమీపంలోనే సింహాచలం.. కాస్త కష్టం అనుకోకుంటే అన్నవరం.
ఇలా.. ఎన్నో ప్రత్యేకతలు. సహజ సౌందర్యానికి వాల్తేరు నిలువెత్తు సాక్ష్యం. వ్యాపార, పర్యాటక, పారిశ్రామిక రంగాల్లోనూ ప్రత్యేతలున్నాయి. అటువంటి విశాఖ ప్రశాంతత 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున విజయలక్ష్మీ పోటీ పడటంతో ఒక్కసారిగా రాజకీయం కొత్తరంగు పులుముకుంది. ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి తనను ఎంతగా బాధించిందో తెలియదు కానీ.. వారసుడిగా జగన్ దాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్టుగానే భావించాలి.
అందుకే.. 2019లో టీడీపీ, జనసేన బలమైన పోటీనిచ్చినా వైసీపీ గెలిచేలా పావులు కదిపాడు. అమరావతి రాజధానిని విశాఖకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకూలమైన వాతావరణం.. విశాఖలో ఉందంటూ ప్రజల్లో నమ్మకాన్ని ముఖ్యంగా గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు దగ్గరలో రాజధాని వచ్చిందనే ఎమోషన్‌ను దగ్గర చేశారు. ఇటువంటి సమయంలో కరోనా కూడా విశాఖను పెద్దగా దెబ్బ తీయలేకపోయింది.
అటువంటిది ఆర్.ఆర్.వెంకటాపురంలో ఎల్జీ పాల్జిమర్స్ కంపెనీ విషవాయువు దెబ్బకు ఐదు ఊళ్లు బాగా భయపడ్డాయి. జనాలు కూడా ఊళ్లలో ఉండేందుకు సాహసించలేకపోతున్నారు. 12 మంది మరణం.. 365 మంది ఆసుపత్రి పాలవటం.. ఇప్పటికీ దాని తాలూకూ విషవాయువు ప్రభావం ఇవన్నీ విశాఖలో రాజకీయ కాకను రేకెత్తిస్తున్నాయి. అసలు ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ కు కేంద్రం పర్యావరణ అనుమతులు ఇవ్వలేదనే వాదన కూడా తెరమీదకు వచ్చింది. టీడీపీదే పాపం అంటూ వైసీపీ విమర్శిస్తుంది. వైసీపీ ఎంపీ వి.విజయ సాయిరెడ్డి బంధువు కోసం వైసీపీ అధికారంలోకి వచ్చాక అనుమతులు ఇచ్చారంటూ టీడీపీ ప్రతి ఆరోపణలు చేస్తుంది. వీటిలో ఏది నిజమనేది కాలమే నిర్ణయించాలి. అప్పటి వరకూ ఈ రాజకీయ వేడి సెగలు గక్కుతూనే ఉంటుంది.