FbTelugu

అంత ప్రమాదం పొంచి ఉందా..?

నాకు ప్రాణభయం ఉంది. నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. ఏపీలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి నాకు ప్రాణహాని ఉంది కాపాడండి సారూ అంటూ వేడుకుంటున్నాడు ఓ ఎంపీ. ఏపీలో అధికార పార్టీగా వైసీపీ ఉంది కాబట్టి ప్రాణాలకు హాని ఉందని మొత్తుకుంటున్న ఎంపీ విపక్షానికి చెందిన వాడై ఉంటారనుకుంటున్నారు. కానీ, తనకు ప్రాణభయం ఉందని చెబుతున్న ఎంపీది కూడా వైసీపీనే. ఇది విచిత్రంగా అనిపిస్తోంది కదా.. కానీ, ఇది ముమ్మాటికి నిజం.

కొంతకాలంగా వైసీపీలో ధిక్కార స్వరం వినిపిస్తున్నారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఇటీవల కాలంలో మరో అడుగు ముందుకేసి వైసీపీ టికెట్‌ ఇవ్వాలని తాను అడగలేదని, ఆ పార్టీ నాయకులు బతిమిలాడితేనే ఆ పార్టీ తరఫున పోటీచేశానని చెప్పారు. పైగా పార్టీ విధానాలు, నాయకుల పోకడలు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు కొందరు ఎంపీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నాడని ఆరోపిస్తున్నారు. అయితే, ఎంపీ మాత్రం తనను పార్టీ నాయకులు, కార్యకర్తలు బెదిరిస్తున్నారని, నియోజకవర్గానికి వస్తే అంతుచూస్తామని అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాదు. తనకు రక్షణ కల్పించాలని ఢిల్లీ పెద్దలకు కూడా ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై ఆయన ‘మీరు నా సభా నాయకుడు. మీరే నాకు రక్షణ కల్పించాలి’ అని రఘురామకృష్ణంరాజు ప్రధాని మోదీని అభ్యర్థించారు. ఇప్పటికే తన పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి తనకు భద్రత కల్పించాలని కోరుతూ ఆయన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాసిన  విషయం తెలిసిందే. తనపై జరుగుతున్న దాడుల గురించి వివరిస్తూ తాజాగా ప్రధానికి ఆయన మరో లేఖ పంపించారు. తన ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని ప్రధానిని కూడా కోరారు. కాగా, స్పీకర్‌కు ఆ ఎంపీ పంపిన లేఖను కేంద్ర హోం సెక్రటరీ పరిశీలిస్తున్నారని తెలిసింది.

ఎంపీ కోరితే కేంద్ర హోంశాఖ భద్రత కల్పించిన ఘటనలు గతంలో ఉన్నాయి. గతంలో రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్‌కు జడ్‌ కేటగిరీ భద్రతను కేంద్రం కల్పించింది. ఇలాంటి  సందర్భాల్లో సీఆర్పీఎఫ్‌ లేదా సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో భద్రత కల్పిస్తారు. అయితే, ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపిస్తున్నంత దారుణంగా ఏపీలో పరిస్థితులు ఉన్నాయా అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఇటీవల కాలంలో టీడీపీపై దృష్టి సారించిన అక్కడ ప్రభుత్వం ఆ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు రావడంతో ఏపీలో కలకలం మొదలైంది. ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై ఇలా కక్ష తీర్చుకుంటుందని టీడీపీ నేతలు ఈ ఘటనను ఉదహరిస్తున్నారు.

కానీ, విపక్షాలను ఇబ్బంది పెడుతుండడం కొంతవరకు నిజమైనా సొంత ఎంపీని ఇంత దారుణంగా బెదిరిస్తుందా..? అలా బెదిరిస్తే అతడు దారికి వస్తాడని భావిస్తుందా..? లేక ఇలా చేస్తే మిగతా ప్రజాప్రతినిధులు పార్టీపై విమర్శలకు దిగకుండా ముందు జాగ్రత్త పడతారా..? అన్న అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. రఘురామ కృష్ణంరాజును అంత తీవ్ర స్థాయిలో వైసీపీ కార్యకర్తలు బెదిరిస్తున్నారా..? ఇదంతా ఆ పార్టీ అధినేత, సీఎంకు తెలుసా.. తెలిసినా పట్టించుకోవడం లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇందులో ఎంత నిజమున్నా.. అబద్ధమున్నా విషయం కేంద్ర పెద్దల వద్దకు చేరడంతో ఏపీలో రాజకీయ కలకలం సృష్టించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.