FbTelugu

ప్రముఖులు… ప్రైవేటులో చికిత్స?

ఢిల్లీ: పేదలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాం… ఎన్నో ఆస్తిపాస్తులు ఉన్నా కాదనుకుని సాదాసీదా జనం కోసమే పనిచేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న నాయకుల బండరాలు బట్టబయలు అవుతున్నాయి.

కరోనా సమయంలో వీరి అసలు రూపాలు కన్పించడంతో ప్రజలు నివ్వెరపోతున్నారు. తమకు కరోనా సోకిందని ట్వీట్ చేస్తున్న నేతలు, ప్రభుత్వ ఆసుపత్రి బదులు ప్రైవేటు హాస్పిటల్ లో దర్జాగా చికిత్స పొందుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు కరోనా పాజిటివ్ వస్తే ప్రభుత్వ దవాఖానాలకు వెళ్తాలని చెబుతున్న నేతలు తాము మాత్రం అందుకు అతీతులం అని చెబుతున్నారు.

ఇవాళ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తనకు పాజిటివ్ నిర్థారణ అయ్యిందని తెలిపారు. వైద్యుల సూచన మేరకు హాస్పిటల్ లో చేరినట్లు తెలిపారు. ఇలా పలువురు నేతలు దేశ వ్యాప్తంగా ట్వీట్ చేస్తున్నారు. అయితే అమిత్ షా ఢిల్లీలోని ఏయిమ్స్ హాస్పిటల్ లో చేరకుండా గుర్గాంవ్ లోని మేదాంత కార్పొరేట్ హాస్పిటల్ లో చేరారు. కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్.యడ్యూరప్ప బెంగళూర్ లోని మణిపాల్ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నారు. తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ చెన్నైలోని కావేరి లో ఆదివారం నాడు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. తమిళనాడు రాష్ట్ర  విద్యుత్ శాఖ మంత్రి తంగమణి, విద్యా శాఖ మంత్రి అంబగళన్, సహాకార శాఖ మంత్రి సెల్లూరు కే రాజు, పంజాబ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తప్త్ సింగ్ భాజ్వా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో చేరి నింపాదిగా చికిత్స చేయించుకుంటున్నారు.

వీరే కాకుండా కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు ప్రైవేటు హాస్పిటల్స్ కే పరుగులు తీస్తున్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు యశోద హాస్పిటల్ లో చేరి చికిత్స చేయించుకున్నారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల ప్రైవేటు చికిత్సపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు, వైద్యులు, సరిపడా బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నప్పుడు ప్రైవేటుకు ఎందుకు వెళ్తున్నారనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులలో కరోనాకు సరిగా చికిత్స చేయడం లేదని చెబెతున్న బడా నేతలు తమకు రోగం వస్తే ప్రైవేటుకు వెళ్లడం జనాలకు ఆగ్రహం తెప్పిస్తున్నది.

You might also like