FbTelugu

మారతారా.. మారిపోతారా?

తెలంగాణలో ఇప్పుడు రాజకీయ వేడి పొగలు సెగలు రాజేస్తోంది. టీఆర్‌ఎస్‌ నేతలకు చలికాలంలోనూ చెమటలు పడుతున్నాయి. తాము చెప్పిందే వేదం.. మేం ఏం చేసినా జనం మా వెనకాలే ఉంటారు అన్న ధీమాతో ఉన్న టీఆర్‌ఎస్‌ నేతలకు ఇప్పుడు దిమ్మదిరిగే ఫలితాలు ఎదురవుతున్నాయి. వరుస ఘటనలతో ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన టీఆర్‌ఎస్‌ వెంటనే జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ చావుదెబ్బ తిన్నది. ఈ రెండు చోట్ల కూడా బీజేపీనే కారును తుక్కుతుక్కు చేసింది.

ఇప్పుడు జోషంతా బీజేపీవైపే ఉంది. కాంగ్రెస్‌ కూడా ఎక్కడా కనిపించకుండా పోయింది. రాజకీయ నేతలతో పాటు సామాన్య జనం కూడా టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని నమ్మే స్థాయికి వచ్చారు. ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకున్న టీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడేం చేయాలా అన్న మీమాంసలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌లో ఉండి మునుగుదామా.. బీజేపీలో చేరి రాజకీయ అవకాశాలను మెరుగు చేసుకుందామా అన్న ఆలోచనలో ఉన్నారు. వాస్తవానికి టీఆర్‌ఎస్‌ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటుందా అన్న అనుమానం ఆ పార్టీ నాయకుల్లో కూడా ఉంది. ఒకవేళ కేసీఆర్‌ ఇప్పటికీ మారకపోతే ప్రజల్లో ఉన్న విషయాలను ఆయనకు చెప్పి ఒప్పించాలా.. కేసీఆర్‌ తమ మాట వింటారా.. జనం అభిప్రాయాన్ని తెలుసుకోకుండా మళ్లీ ఇలాగే పుట్టి మునగడం ఖాయం కదా.. ఇప్పుడు తాము కేసీఆర్‌కు వాస్తవ పరిస్థితులు చెప్పి ఆయనను మార్చాలా.. లేక తామే బీజేపీలోకి మారాలా అన్న ఆలోచనలో చాలామంది నేతలున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ నేతలు బీజేపీలోకి లైన్లు కట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఆలస్యం చేస్తే కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. దీంతో వారికంటే వెనుకబడాల్సి వస్తుందన్న ఆలోచనలో టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు. మొత్తానికి మా సీఎం కేసీఆర్‌ మారతారా.. లేక మేమే బీజేపీలోకి మారిపోవాలా అన్న మీమాంసలో ఉన్నట్టు పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు చర్చించుకుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.