FbTelugu

కృష్ణపట్నం ఆనందయ్యపై పోలీసు కేసు

నెల్లూరు: కరోనా ఆయుర్వేద మందు ఉచితంగా పంపిణీ చేస్తున్న బొనిగె ఆనందయ్య పై నెల్లూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. మందు పేరుతో జనం వేల సంఖ్యలో గుమిగూడారని, కరోనా నిబంధనలు ఉల్లంఘించారని నేరం మోపారు.

జనం రద్దీ, మందు పంపిణీపై సమాధానం ఇవ్వాల్సిందిగా నెల్లూరు జిల్లా ఎస్పి తన కార్యాలయానికి ఇవాళ ఆనందయ్యను పిలిపించి విచారించారు. ఆనందయ్య మందుకు రెండు రోజుల్లో అనుమతులు వస్తాయని, అనుమతులు రాగానే కొరియర్ ద్వారా ఉచితంగా మందులు అందరికీ పంపిస్తామని స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. ఆయుర్వేదంపై తనకు ఉన్న పట్టుతో కొద్ది రోజులుగా శ్రమించి ప్రత్యేక మందు తయారు చేశారు. కరోనా రాకుండా ఉండేందుకు, కరోనా పాజటివ్ వచ్చిన వారికి, వెంటిలేటర్ పై ఉన్నవారికి ఇలా మూడు రకాల మందులు పంపిణీ చేస్తున్నారు. పసరు మందుకు శాస్త్రీయత లేదంటూ జిల్లా కలెక్టర్ పంపిణీ ని ఇవాళ మళ్లీ ఆపివేయించారు.

భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రత్యేక చొరవతో ఇవాళ రాత్రి ఐసిఎంఆర్ ప్రతినిధుల బృందం కృష్ణపట్నం రానున్నది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ మందుకు వినియోగిస్తున్న మూలికలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గోవర్థన్ రెడ్డి మందు పంపిణీ ప్రారంభించడం, ఆ వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఆపడం వెంటవెంటనే జరిగిపోయింది. తాజాగా పోలీసులు కేసు పెట్టడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.