FbTelugu

ఎంపీ బండి సంజయ్ పై పోలీసుల దాడి

Police-assault-MP-Bandi-Sanjay

కరీంనగర్: ఎంపీ బండి సంజయ్ పై పోలీసు అధికారి చేయిచేసుకోవడంపై డీజీపీ వెంటనే స్పందించాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి కోరారు. వెంటనే కరీంనగర్ ఏసీపీ, పోలీస్ కమిషనర్‌ లను సస్పెండ్ చేయాలన్నారు. పోలీసు భౌతికదాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ప్రభుత్వ నిరంకుశ వైఖరిని దేశం ముందు పెడ్తామన్నారు. పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశ పెడ్తామన్నారు. కరీంనగర్ లో పోలీసు దౌర్జన్యకాండ పై కేంద్ర నాయకత్వం కూడా దృష్టి పెట్టిందన్నారు.

పోలీసులు పబ్లిక్ సర్వెంట్ లు, కేసీఆర్ సర్వెంట్లు కాదన్న విషయం గుర్తించాలని హితవు పలికారు. హోంమంత్రి మహమూద్ అలీ ద్వారా పోలీసులతో కేసీఆర్ ఈ పని చేయిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోందన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై ఏసీపీ చేయిచేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒక ఎంపీ మీద పోలీస్ అధికారి చేయి చేసుకోవడమా, ఇంతటి దుర్మార్గమా? అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు కాబట్టి కేంద్రహోంశాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి చర్యలు తీసుకోవాలన్నారు. నాడు ముఫ్తీ మహమ్మద్ సయీద్ కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు కశ్మీర్ లో పండితుల ఊచకోత జరిగిందన్నారు. నేడు మహమూద్ అలీ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో దయనీయంగా హిందువుల పరిస్థితి ఉందన్నారు. రజకార్ల అరాచకాలను కళ్లకు కట్టినట్టు తెలంగాణ సర్కారు చూపెడుతోందన్నారు. తెలంగాణలో నడుస్తోంది రాజ్యాంగబద్ద పాలన కాదు నయా నిజాం పాలన అని అర్వింద్ ఆరోపించారు. గుండెపోటుతో కన్నుమూసిన కరీంనగర్ – 2 డిపో డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్ర సందర్బంగా పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. శాంతియుతంగా సాగుతున్న అంతిమయాత్రలో పాల్గొన్న బండి సంజయ్ కాలర్ పట్టి, పోలీసులు చేయి చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.

పోలీసుల దురుసుతనాన్ని ఆషామాషీగా విడ్చిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ చెప్పుచేతల్లో కీలుబొమ్మల్లాగా వ్యవహరిస్తున్న పోలీసుల ఆకృత్యాలను దేశం ముందు పెడతామన్నారు.

You might also like