FbTelugu

ఇప్పుడెందుకు ఆగాయో..!

ఇండియాలో అందరినీ భయపెడుతున్న అంశం ఇప్పుడు పెట్రోలియం ధరలు. వాటి ధరలు నిత్యం పెరుగుతుండడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ఫిబ్రవరి నెలలో రోజూ వాటి ధరలు పెరిగాయి. ఆ నెల మొదటి నుంచి పెరుగుతూ వస్తున్న ధరలు మార్చి 25 వరకు అదే పరంపరను కొనసాగించాయి. పెట్రో ధరల నియంత్రణలో కేంద్రం చేతులెత్తేసింది. వాటి ధరల నియంత్రణలో తమ చేతిలో లేదని ప్రపంచ మార్కెట్‌లో బ్యారల్‌ ధరల హెచ్చు తగ్గులను బట్టి పెట్రోల్‌ సంస్థలే ధరలను నిర్ణయిస్తాయని కేంద్రం చెబుతూ వస్తోంది. వాస్తవానికి ప్రపంచ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గతంతో పోలిస్తే భారీగా తగ్గాయి. అయినా, పెట్రోలియం ధరలు ఇండియాలో తగ్గలేదు సరికదా.. ఇంకా పెరుగుతూ పోతున్నాయి. దీనికి ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పెట్రోలియం అమ్మకాలపై పన్నులు పెంచడమే. అయితే కేంద్రం చెబుతున్నట్టు వాటి ధరల నియంత్రణ తమ చేతిలో లేకుంటే భారత్‌లోని ఐదు రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడే సమయం నుంచి పెట్రో ధరలు ఎందుకు పెరగడం లేదు. అంతకు ముందు నెల రోజులుగా నిత్యం జెట్‌ స్పీడుగా పెరిగిన ధరలు ఫిబ్రవరి 25నుంచి నిలకడగా ఎందుకు ఉన్నాయి.

అంటే ఆ అయిదు రాష్ట్రాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత అంటే ఫిబ్రవరి 25 నుంచి నేటివరకు పెట్రో ధరలు పెరగలేదు. దాదాపుగా 17 రోజుల పాటు వాటి ధరలు పెరగకపోవడానికి కారణం ఏమిటి..? ఐదు రాష్ట్రాలకు జరిగే ఎన్నికలకు.. పెట్రోలియం ధరల నిలకడకు ఏమైనా సంబంధం ఉందా అన్న అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోంది. సాధారణంగా ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఇలా ధరలు నియంత్రణలో ఉండడం.. ఎన్నికలు ముగిసిన అర్ధరాత్రే ధరలు పెరగడం, కొన్ని వస్తువులు, పన్నులను కూడా ఎన్నికల దాకా ఆగి ఆ తర్వాత ప్రభుత్వాలు పెంచడాన్ని నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే, ఇప్పుడు కూడా ఆ అయిదు రాష్ట్రాల ఎన్నికలకు.. పెట్రో ధరల నియంత్రణకు సంబంధం ఉందా అంటే రాజకీయ విశ్లేషకులు మాత్రం ముమ్మాటికీ ఇదే నిజం అంటున్నారు. ఎన్నికల ముగిసిన రోజే పెట్రో ధరలు పెరిగే అవకాశాలు మెండుగా ఉంటాయని వారు చెబుతున్నారు. పెట్రోలియం ధరలపై అసలేం జరుగుతుందో తెలియక సామాన్యులు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. ఇందులో ఏం దాగి ఉందో.. లోగుట్టు పెరుమాళ్లకెరుక అంటూ ఉసూరుమంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.