హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పాలని హైకోర్టు లో మాండమస్ పిటిషన్ దాఖలైంది.
ప్రగతి భవన్ లో 30 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. అప్పటి నుండి సీఎం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కి వెళ్లారని పిటీషనర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయినట్టు యూట్యూబ్ లో ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడి ఆరోగ్యం గురించి తెలియాల్సిన అవసరం రాష్ట ప్రజలకు ఉందన్నారు.
ప్రభుత్వం లో పనిచేస్తున్న వివిధ విభాగాలకు చెందిన అధికారులు ముఖ్యమంత్రి లేకపోవడం వలన సక్రమంగా పనిచేయడం లేదని పిటీషనర్ విన్నవించారు. గత నెల రోజుల నుండి కేసీఆర్ కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆందోళన చెందుతున్నారని పిటీషనర్ పేర్కొన్నాడు.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఏంతో కృషి చేసి సాధించిన కేసీఆర్ సీఎం అయ్యారని తెలిపారు. అలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం గురించి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని పిటిషనర్ విన్నవించాడు.