FbTelugu

11 నుంచే భక్తులకు అనుమతి: టీటీడీ

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెల 11నుంచి పరిమిత సంఖ్యలోనే సాధారణ భక్తులకు దర్శనావకాశం కల్పించనున్నట్టు టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.

8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులతో ప్రయోగాత్మక దర్శనం (ట్రయల్ రన్) పరిశీలించి, 11వ తేదీ నుంచి సాధారణ భక్తులకు అనుమతిస్తామని ఛైర్మన్ సుబ్బారెడ్డి మీడియాకు  చెప్పారు.10వ తేదీ స్థానిక భక్తులకు దర్శనం చేసుకునేందుకు అవకాశమిస్తున్నామని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడే ఈ దర్శన అవకాశం కల్పించనున్నట్టు తెలిపారు. రోజుకు మూడు వేల మందికి మాత్రమే అనుమతిస్తామని, 65 ఏళ్ళు పైబడిన వృద్ధులు, పదేళ్లలోపు పిల్లలకు కొండ పైకి అనుమతి లేదన్నారు.

ఉదయం 6:00 గంటల నుంచి సాయంత్రం 7:30 వరకు మాత్రమే దర్శనాలకు అనుమతించనున్నారు. అలిపిరి నుంచి కాలిబాటన వచ్చేవారికి మాత్రమే పర్మిషన్ ఇవ్వనున్నారు. శ్రీవారి మెట్టు మార్గం మీదుగా కాలినడకకు పర్మిషన్ లేదు. అలిపిరి గేటు వద్ద ధర్మల్ స్క్రీనింగ్ కేంద్రం ఏర్పాటు చేశామని, కొండపైన ల్యాబ్ లో భక్తుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షిస్తారని అన్నారు.శ్రీవారి దర్శనాలే తప్ప తీర్థ ప్రసాదాలు ఉండవని స్పష్టం చేశారు.

ఆన్ లైన్ లో దర్శనం బుక్ చేసుకున్న వారికి ఆన్ లైన్ లోనే గదుల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఒక్కో రూమ్ లో ఇద్దరికి మాత్రమే అనుమతించారు. దేశంలో కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్ల పరిధిలో ఉన్నవారు రావొద్దని, ఒకవేళ ఆన్ లైన్ లో బుక్ చేసుకుని ఇలాంటి వారు వస్తే అలిపిరి గేటు వద్దే నిలిపివేయడం జరుగుతుందన్నారు. 8 నుంచి లడ్డు ఆన్ లైన్ ద్వారా డోర్ డెలివరీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.

వాహనాలకు శానిటైజ్ చేశాకే కొండపైకి అనుమతిస్తారని, కళ్యాణ కట్ట వద్ద తలనీలాలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా హుండీని తాకకుండా భక్తులు కానుకలు వేయాలని సుబ్బారెడ్డి కోరారు. ఉచిత అన్నదాన సత్రంలోకి తక్కువమందికే అనుమతిస్తామని, కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్క భక్తుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

You might also like