హైదరాబాద్: ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తే అధికారంలోకి వచ్చిన బీజేపీ రద్దు చేసిందని, అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
ఈ ప్రాజెక్టును రద్దు చేయడం మూలంగా లక్షలాది మందికి ఉద్యోగాలు రాకుండా నష్టం జరిగిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి కోసం ఐటీఐఆర్ పై టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోందని ఆయన మండిపడ్డారు. ఇవాళ గాంధీ భవన్ లో టీపీసీసీ అనుబంధ సంఘాలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం దుబ్బాక ఎన్నికలతో మొదలైందని, ఏమాత్రం బలం లేని బీజేపీ నీటి బుడగలాంటి పార్టీ అని ఆయన అన్నారు. ఏడేళ్ల బీజేపీ పాలనలో దేశానికి ఒరిగిందేమి లేదని, పారిశ్రామికవేత్తలను పెంచేందుకే నిర్ణయాలు తీసుకున్నారని ఉత్తమ్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ మూలంగా తెలంగాణకు న్యాయం జరక్కపోగా తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ముడి చమురు ధరలు తగ్గుతున్నా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు పన్నులు పెంచుతూ పోతున్నాయని, ఇంధన ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఉత్తమ్ ఆరోపించారు.