గుంటూరు: విశాఖపట్నం జిల్లా పరవాడలో సాయినార్ లైఫ్ సైన్సెస్ సంస్థలో విష వాయువులు విడుదలై ఇద్దరు మృతి చెందడం బాధాకరమని జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కల్యాణ్ అన్నారు.
మరో అయిదుగురు అస్వస్థతకు లోనయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. ఈ మేరకు పవన్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ వల్ల చోటు చేసుకున్న దుర్ఘటన ఇంకా కళ్ల ముందే ఉందన్నారు. కొద్ది రోజుల కిందటే నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లో విష వాయువు వెలువడి ఒకరు మృత్యువాతపడ్డారు.
ఇంతలోనే సాయినార్ సంస్థలో విష వాయువులకు ఇద్దరు బలి కావడం కలచివేస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలని పవన్ ప్రభుత్వాన్ని కోరారు.