FbTelugu

రెండు జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

పవన్ కళ్యాణ్ డిమాండ్
గుంటూరు: రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చి నడిరోడ్డు పైకి వచ్చేసిన రైతులకు అండగా నిలబడేందుకు రెండు జిల్లాలకు చెందిన వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేసి పోరాటం చేయాలని ఆయన అన్నారు. అధికార, ప్రతిపక్షాలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, భూములు ఇచ్చిన రైతులపై బాధ్యత ఉన్నా ప్రత్యక్ష పోరాటం మొదలుపెట్టాలని సూచించారు. ఆదివారం ఉదయం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశాన్ని టెలీ కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టారు.
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు అంశాలపై జనసేన పీఏసీ చర్చించింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా ప్రజలకు సమస్యలు సృష్టిస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా కుదేలైంది. కరోనా నివారణ చర్యలు చేపట్టలేక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆసుపత్రుల్లో సరైన సేవలు లేవు. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రాజధాని వికేంద్రీకరణ పేరుతో ఓ క్రీడకు తెర తీశారని ఆయన ఆరోపించారు.
తప్పు చేసింది వైసీపీ, తెలుగుదేశం పార్టీలయితే జనసేనను ఎలా ప్రశ్నిస్తారు. నిలదీయాలనుకున్న వారు ఆ రెండు పార్టీల పెద్దలను నిలదీయాలన్నారు. వ్యక్తిగత అజెండాలు, పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా రాజధానులు ఉండవు. తమ పార్టీ ఆర్థికావసరాలకు అనుగుణంగా రాజధానులను మార్చుకొంటామంటే కుదరదని పవన్ అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో 2004లో ఏర్పాటైన ప్రభుత్వ పాలనలో హైదరాబాద్ చుట్టూ సాగించిన భూ వ్యవహారాలు, లావాదేవీల వల్లే తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఆవేదన గూడుకట్టుకొందని పవన్ తెలిపారు. రింగ్ రోడ్లు, ఎస్‌ఈజెడ్ లు అంటూ భూములు తీసుకొని కొందరికే ఇవ్వడంతో పేద ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. అది రాష్ట్ర విభజనకు దారి తీసిందన్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల మధ్య చిచ్చు రేపేలా వైసీపీ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ అంశాన్ని తీసుకువచ్చింది. ఈ మూడు ప్రాంతాల ప్రజల మధ్య ఎప్పుడూ సఖ్యత ఉందన్నారు. ఆ సుహృద్భావ వాతావరణాన్ని రాజధానుల పేరుతో పాడు చేయవద్దు. ప్రాంతీయ విభేదాలతో మరోసారి విడిపోయే స్థితి తీసుకురాకుండా చూడాలని పవన్ కళ్యాణ్ కోరారు.

You might also like