FbTelugu

తిరుమలలో అన్యమత ప్రచారం అబద్దం: రమణ దీక్షితులు

తాడేపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ప్రచారం జరగడం లేదని టీటీడీ ప్రధాన అర్చకులు ఏవి.రమణ దీక్షితులు స్పష్టం చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగదని, వైఎస్ఆర్ హయాంలో కూడా ఈ విధంగానే దుష్ప్రచారం చేశారని ఆయన టీడీపీ ఆరోపణలను ఖండించారు.

సిఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ ను రమణ దీక్షితులు, ఇతర అర్చకులు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల, తిరుపతి దేవస్ధానాల పరిధిలోని తిరుమల వేంకటేశ్వరస్వామి, తిరుపతి గోవిందరాజ స్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవార్ల ఆలయాలకు సంబంధించిన 15 మందికి వంశపారంపర్యాన్ని పునరుద్దరించడంపై కృతజ్ఞతలు తెలియజేశారు. దేవాలయాల్లో నిత్య నైవేద్యాలు, దూపదీపాలు ఆటంకం లేకుండా కొనసాగించాలని జగన్ ను కోరారు. జగన్ ను కలిసిన తరువాత రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడుతూ.. సంవత్సరాల నుంచి వంశ పారంపర్య అర్చకత్వం కొనసాగుతోందని తెలిపారు. ఇటీవల దానికి అడ్డంకులు ఏర్పడ్డాయని, సీఎం దీన్ని పునరుద్ధరించారన్నారు.

తిరుమలలో వంశపారంపర్య అర్చకులకు పదవీ విరమణను సిఎం వైఎస్‌.జగన్‌ రద్దు చేశారని రమణ దీక్షితులు ధన్యవాదాలు తెలిపారు. జగన్ మరిన్ని సంవత్సరాలు సిఎంగా ఉండి రాష్ట్రంలోని అర్చకులకు మేలు చేయాలని కోరారు. చెట్టుకి పండ్లు ఉన్నపుడు రాళ్ల తో కొట్టడం సహజమని, టిటిడి పై ఆరోపణలు కూడా అలాంటివేనని ఆయన అన్నారు. రాజకీయాల్లో ఎవరు ఉన్నా ఆధారం లేని విమర్శలు చేస్తూనే ఉన్నారని రమణ దీక్షితులు ఆక్షేపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.