FbTelugu

రాష్ట్రాలకు అదనంగా ఆక్సిజన్, రెమిడెసివిర్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అత్యధిక రోజువారీ కేసులు నమోదవుతున్న 8 రాష్ట్రాలకు సగటున 8% ఆక్సిజన్‌ కేటాయింపులు చేసింది. కరోనా రోగుల చికిత్స కోసం కేంద్ర ప్రభుత్వం అత్యధిక కేసులున్న 19 రాష్ట్రాలకు ఈ నెల 30 వరకు 11 లక్షల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను కేటాయించింది.
ఆక్సిజన్‌ కొరతతో న్యూఢిల్లీ, ముంబయి లాంటి చోట్ల రోగుల ప్రాణాలు పోతుండటం, ఆసుపత్రులు నేరుగా హైకోర్టును ఆశ్రయిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం మేల్కొన్నది. వీరిని చూసి మరికొన్ని రాష్ట్రాలు కూడా హైకోర్టును ఆశ్రయిస్తే పరువు పోతుందనే ఉద్ధేశంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ముందు జాగ్రత్తగా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ లకు ఆక్సిజన్‌ కేటాయింపును 3,945 మెట్రిక్‌ టన్నుల నుంచి 4,278 మెట్రిక్‌ టన్నులకు పెంచింది.

క్లినికల్‌ ప్రొటోకాల్‌ ప్రకారం రెమ్‌డెసివిర్‌ను అకస్మాత్తుగా రోగం తీవ్రస్థాయికి చేరి, తప్పనిసరిగా ఆక్సిజన్‌పై ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలని వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు స్పష్టం చేసింది. రెమిడెసివిర్ ఇంజెక్షన్ వాయిల్స్ ను ఆంధ్రప్రదేశ్‌కు 59 వేలు, తెలంగాణకు 21,500 కేటాయించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. మహారాష్ట్రకు అత్యధికంగా 2,69,200, గుజరాత్‌కు 1,63,500, ఉత్తర్‌ప్రదేశ్‌కు 1,22,800, మధ్యప్రదేశ్‌కు 92,400, న్యూఢిల్లీకి 61,900 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను ఇవ్వనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.