FbTelugu

సొంత పార్టీ కార్యకర్తలే..!

వైసీపీ ఎమ్మెల్యేలకు సొంతపార్టీ కార్యకర్తలే ఎదురు తిరుగుతున్నారా..? ఎమ్మెల్యేల ఆగడాలను వారి కార్యకర్తలే తట్టుకోలేక పోతున్నారా..? ఇక వారితో అమీతుమీ తేల్చుకోవాలనుకుంటున్నారా..? వారి అవినీతి చర్యలను గట్టిగానే ప్రశ్నిస్తున్నారా..? కార్యకర్తల ఫిర్యాదులను వైసీపీ పెద్దలు పట్టించుకోవడం లేదా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల కాలంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిపై కార్యకర్తల నుంచి ఫిర్యాదులు బయటకు వస్తున్నాయి.

సొంత పార్టీ కార్యకర్తలే ఫిర్యాదులు చేస్తున్నా అధిష్టానం పట్టించుకోకపోవడంతో వారు ఇక అమీతుమీ తేల్చుకునేందుకు బజారుకెక్కుతున్నారు. ఇటీవల కాలంలోనే వైసీపీలో ఫైర్‌బ్రాండ్‌ అయిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు మైన్స్‌ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారని, అక్రమ మైనింగ్‌లను ఏర్పాటు చేసి కోట్లు దండుకుంటున్నారని వైసీపీ కార్యకర్తలు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోలేదు. చివరకు పత్రికలకెక్కారు. బజారున పడి విమర్శలకు దిగారు. అయినా అంతటితో ఆగలేదు. చివరకు ఈ విషయంలోనే అంబటికి వ్యతిరేకంగా అక్రమ మైనింగ్‌ ఏర్పాటు విషయంలో కోర్టుకెక్కారు. ఈ కేసు నేడు (మంగళవారం) చర్చకు రానుంది. ఇక తాజాగా గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా ఓ వివాదంలో చిక్కుకున్నారు. తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామానికి చెందిన మేకల రవీంద్ర అనే వైసీపీ కార్యకర్త ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఉండవల్లి శ్రీదేవి తనకు రూ.1.40 కోట్లు ఇవ్వాలంటూ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు కలకలం రేపుతోంది. ఎన్నికల సమయంలో ఉండవల్లి శ్రీదేవి తనను డబ్బు కావాలని అడిగితే ఇచ్చానని రవి వెల్లడించారు. తన భర్త మోసం చేశాడని తనతో చెప్పుకుని ఉండవల్లి శ్రీదేవి వాపోయిందని, ఆమె కన్నీరు పెట్టుకోవడంతో చూడలేక తనకు తెలిసిన వాళ్ల వద్ద డబ్బు తీసుకుని ఆమెకు ఇచ్చానని రవి వివరించారు. ఇచ్చిన డబ్బు మొత్తం తిరిగి ఇవ్వమని అడిగితే ఇప్పటివరకు ఆమె ఇచ్చింది రూ.60 లక్షలు మాత్రమేనని అన్నారు. ఇంకా రూ.80 లక్షలు ఇవ్వాల్సి ఉండగా, బ్యాలెన్స్‌ ఇచ్చేది లేదని బెదిరిస్తున్నారని మేకల రవి తెలిపారు. ఈ విషయంలో తనకు సీఎం జగన్‌ న్యాయం చేయాలని, లేకపోతే రాజధాని ప్రాంతంలో జరిగే మొదటి వైసీపీ కార్యకర్త ఆత్మహత్య తనదే అవుతుందని స్పష్టం చేశారు. సోమవారం రవి మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే, వైసీపీ నేతలు మాత్రం మేకల రవి వాదనలను నమ్మడంలేదు. రూ.1.40 కోట్లు అప్పు ఇచ్చే ఆర్థికస్థాయి రవికి లేదని, రవికి అంతపెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చేవారు కూడా ఎవరూ లేరని అంటున్నారు. పైగా, కోటి రూపాయలకు పైగా సొమ్ము ఇచ్చి ఎలాంటి అగ్రిమెంట్‌ తీసుకోకపోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని హెచ్చరిస్తున్నారు.

మొత్తానికి ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ కార్యకర్తల నుంచే విమర్శలు, న్యాయ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంకా అనేక మంది ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లోని కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. తమను పట్టించుకోకుండా అక్రమ సంపాదనపైనే తమ పార్టీ ఎమ్మెల్యేలు దృష్టి నిలిపారని వైపీసీ కార్యకర్తలు కినుకుగా ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇలాంటి వివాదాల్లో ఇంకా ఎంతమంది చిక్కుకుంటారో చూడాలి మరి.

You might also like