FbTelugu

ఆ రాష్ట్రంలో ఓపెన్ బుక్ పరీక్షలు

రాయ్ పూర్: ఇంతకు ముందు ఓపెన్ బుక్ విధానం రద్దు చేసిన పెద్దలు ఇప్పుడున్న పరిస్థితుల్లో దానికే మొగ్గు చూపక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా మహమ్మారి కారణంగా ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు చత్తీస్ గఢ్ రాష్ట్రం సిద్దమైంది.

కరోనా మహమ్మారి కారణంగా గత విద్యా సంవత్సరం, ఈ విద్యా సంవత్సరం పరీక్షలు నిర్వహించలేకపోయారు. కొన్ని పరీక్షలు వాయిదా వేయడం, మరికొన్ని రద్దు చేయడం జరిగింది. పరీక్షల నిర్వహణపై పలు హైకోర్టులలో కేసులు నడుస్తున్నాయి. అటు తల్లిదండ్రులు, ఇటు ప్రభుత్వాలు తలలు పట్టుకున్నాయి. అయితే చత్తీస్ గఢ్ ప్రభుత్వం వద్దనుకున్న ఓపెన్ బుక్ పరీక్షల విధానానికే మొగ్గు చూపింది. 12వ తరగతి పరీక్షలను ఓపెన్ బుక్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను చత్తీస్ గఢ్ విద్యాశాఖ విడుదల చేసింది.
జూన్ 1 నుంచి 5వ తేదీ లోపు విద్యార్థి ఎప్పుడైనా పరీక్షా ప్రశ్నపత్రాన్ని, కీ ని తీసుకోవచ్చని తెలిపింది. పరీక్ష రాసిన ఐదు రోజులకు సమాధాన పత్రాన్ని ఇన్విజిలేటర్ కు సమర్పించాల్సి ఉంటుంది. ఒక విద్యార్థి 5వ తేదీన ప్రశ్న పత్రాన్ని తీసుకువెళ్తే 10వ తేదీన సమర్పించాల్సి ఉంటుంది. సమాధాన పత్రాన్ని పోస్టులో పంపిస్తే స్వీకరించరు. 12వ తరగతి పరీక్షల కోసం 2.90 లక్షల మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ విధానం విజయవంతం అయితే మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుసరించే అవకాశాలు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.