FbTelugu

భయం తొలగిస్తేనే సాధారణ పరిస్థితులు: జగన్

అమరావతి: కరోనా పై భయం, ఆందోళన తొలగించడం ద్వారానే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని సీఎం వైఎస్.జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో అన్నారు.

కరోనాపై ప్రజల్లో భయాందోళనను తొలగించలేకపోతే అడుగు ముందుకు వేయలేమన్నారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌పై కార్యాచరణను ప్రధాని ఈ కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ పలు సూచనలు చేశారు.

 

– కేంద్రం సూచనలు, సలహాలకు అనుగుణంగా రెండు నెలల నుంచి చర్యలు, లాక్‌డౌన్‌లో కేంద్రం ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చింది.

– దాని వల్ల కేసులను నియంత్రించగలిగాం.

– రాష్ట్రంలో మూడు పర్యాయాలు సమగ్ర సర్వే నిర్వహించాం. దాదాపు 30 వేల మందిలో కరోనా లక్షణాలు కనిపించడంతో, వారందరికీ పరీక్షలు నిర్వహించాం. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్ల ద్వారా సర్వే కొనసాగించాం.

– 6 వారాల లాక్‌డౌన్‌ పరిస్థితులను సమీక్షించుకుంటే.. సాధారణ పరిస్థితులు నెలకొనే దిశలో చర్యలు తీసుకోవాల్సి ఉంది.

– కరోనా పాజిటివ్‌ లక్షణాలు గుర్తించిన కుటుంబాలు సమాజంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. సమాజం వారిని వేరుగా చూస్తుందన్న భావన నెలకొంది, వివక్ష కనిపిస్తోంది.

– ఈ కారణం వల్లనే కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పడం లేదు. ఇది మొత్తం కరోనా పరీక్షల ఉద్దేశం, లక్ష్యాలపై ప్రభావం చూపిస్తోంది.

– కరోనా కేసులు కనిపించిన ప్రాంతాలను క్లస్టర్లు, కంటైన్మెంట్‌ జోన్లుగా గుర్తించడం, అదే విధంగా సంస్థాగతంగా క్వారంటైన్‌ ప్రక్రియపై మరోసారి ఆలోచించాల్సి ఉంది.

– ఈ ప్రక్రియలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక వ్యూహంతో వ్యవహరించాల్సి ఉంది.

– కరోనా లక్షణాలు కనిపిస్తే స్వయంగా చెప్పడం, వైద్య సహాయం పొందడం, తమంతట తాముగా ఐసొలేషన్‌కు వెళ్లడం వంటివి కొనసాగాల్సి ఉంది.

– దాదాపు 98 శాతం కేసులు నయం చేయగలమన్న దానిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది.

– కాబట్టి కరోనాకు వ్యాక్సిన్‌ కనుక్కొనే వరకు ఆ వైరస్‌లో మనం కలిసి ముందుకు సాగాల్సి ఉందన్న విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంది.

– భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, హ్యాండ్‌ శానిటైజర్ల వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం.. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ముఖ్యమైనవి.

– వర్క్‌ ప్లేస్‌లు, ఉత్పత్తి కేంద్రాలు (మానుఫ్యాక్చరింగ్‌ యూనిట్లు), మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో ఒక స్పష్టమైన ప్రామాణికత (ఎస్‌ఓపీ)ను రూపొందించాల్సి ఉంది.

– అవసరమైన శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్లు, కోవిడ్‌–19 సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా, కరోనా వ్యాధి లక్షణాలు కనిపించిన ప్రజలు ఎలాంటి భయం, సంకోచం లేకుండా తమంతట తాము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్ష చేయించుకోవడం, వైద్యం పొందేలా ప్రోత్సహిస్తున్నాం.

– వాటితో పాటు, టెలి మెడిసిన్, కాల్‌ సెంటర్లు కూడా కరోనా సోకిన వారికి పరీక్షలు, చికిత్స చేయడంలో తమ వంతు పాత్ర పోషించనున్నాయి.

– హైరిస్క్‌ ఉన్న వారికి మరింత అవగాహన కల్పించడంతో పాటు, హోం ఐసొలేషన్‌కు సంబంధించి ప్రజలకు కూడా అవగాహన కల్పించాల్సి ఉంది.

– ప్రతి ఒక్కరికి స్పష్టమైన అవగాహన కల్పించడం ద్వారా, ఎవరికి వారు వ్యక్తిగతంగా పూర్తి జాగ్రత్తలు పాటించడంతో పాటు, వారి కుటుంబాలను కూడా కాపాడుకునే విధంగా మార్చాల్సి ఉంది.

– ఆ ప్రక్రియ కోసం ఇప్పుడున్న వైద్య విధానం, వ్యవస్థలో చాలా మార్పులు తీసుకు రావాల్సి ఉంది.

– వైద్య ఆరోగ్య రంగంలో గ్రామ స్థాయి నుంచి అత్యున్నత స్థాయిలో టీచింగ్‌ ఆస్పత్రుల స్థాయిలో కూడా సమూల మార్పులు తీసుకువచ్చే దిశలో రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది.

– రోజులో 24 గంటల పాటు పని చేసే సిబ్బందితో గ్రామ క్లినిక్‌లు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నాం.

– పార్లమెంటు నియోజకవర్గంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా చాలా మందికి వైద్య సేవలు అందించడంతో పాటు, వాటిలో వైద్యులు, నర్సుల కొరత కూడా ఉండబోదు.

– అదే విధంగా అన్ని ఆస్పత్రులను సమూలంగా మార్చి, జాతీయ స్థాయిలో వాటిని తీర్చి దిద్దాల్సి ఉంది.

– గ్రామాల్లో పని చేసే క్లినిక్‌లు కూడా ఉన్నత ప్రమాణాలు కలిగి ఉండాల్సి ఉంది. ఎవరికి ఏ జబ్బు లక్షణాలు కనిపించినా, ఆ క్లినిక్‌లకు వెళ్లి వైద్య సలహాలు పొందాలి. అవసరమైతే చికిత్స కూడా అందించాలి. ఆ స్థాయి ప్రమాణాలతో అవి పని చేయాల్సి ఉంది.

– తయారీ రంగం పుంజుకోవాలంటే ముడిసరుకులు అందడం, ప్రజల రాకపోకలు (మూమెంట్‌) అనేది చాలా అత్యవసరం.

– సరుకుల రవాణాకు అనుమతించినప్పటికీ చాలా రాష్ట్రాల్లో అవరోధాలు ఏర్పడుతున్నాయి.

– మా రాష్ట్రంలో తయారీ రంగం పూర్తిగా స్తంభించిపోయింది.

– దేశవ్యాప్తంగా మార్కెట్లు, రిటైల్‌ రంగం మూతబడి ఉండడంతో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ లేదు. దీంతో రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు మిగులు కనిపించి.. తీవ్రంగా దెబ్బ పడుతోంది. మరోవైపు రాష్ట్రంలో వినియోగం తక్కువ.

– రాష్ట్రాల మధ్య రవాణాకు సంబంధించి పూర్తి అవరోధాలు తొలగిపోవాలి. ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఒక డ్రైవర్‌ సరుకులను ఎక్కడికకైనా సరే తీసుకు వెళ్లగలననే భరోసా ఉండాలి. తనను ఎవ్వరూ కూడా నిర్బంధించరని, క్వారంటైన్‌ చేయరనే నమ్మకం ఆ డ్రైవర్‌కు కలగాలి.

– సరకుల రవాణా సాధారణ స్థాయిలో జరగకుండా, వలస కూలీలు, కార్మికులు ఆయా ఫ్యాక్టరీల్లో పని చేయగలిగే పరిస్థితులు లేకుండా, రాష్ట్రాల సరిహద్దుల వద్ద సాధారణ పరిస్థితులు తలెత్తకుండా… ఆర్థిక వ్యవస్థ మళ్లీ పునరుజ్జీవం కాదు.

– ప్రజలకు తమ పనులకు వెళ్లాలంటే.. ప్రజా రవాణా అందుబాటులో లేదు. ప్రజా రవాణా రంగం మీద ఉన్న ఆంక్షలను తొలగించాలి.

– వలస కార్మికులైనా, విధులకు హాజరయ్యే వారైనా సరే.. వారికి ప్రజా రవాణా అందుబాటులోకి తీసుకు రాలేకపోతే.. ఆర్థిక వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకోదు.

– వివిధ రాష్ట్రాల్లోని పరిశ్రమల్లో పని చేస్తున్న కూలీలు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోవడం చూస్తున్నాం. వారు తాము పని చేసిన చోటుకి తిరిగి రాకపోతే సాధారణ పరిస్థితులు తిరిగి రావు. వారిలో భయం, ఆందోళన తొలగిపోవాలి.

– బస్సుల్లో సరిపడినంత భౌతిక దూరం పాటించాలి. ప్రజారవాణాలో మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి చేయాలి.

– షాపింగ్‌ సెంటర్లు కూడా తెరుచుకునేందుకు అవకాశం కల్పిస్తూనే భౌతిక దూరం పాటించాలి, మాస్క్‌లు ధరించేలా చూడాలి.

– వీటిని సరిగ్గా అమలు చేసేలా స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)లను అందుబాటులోకి తీసుకురావాలి.

– ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఇచ్చే ఈ రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకురాకుండా ఉండాలని కోరుతున్నాం.

– రాష్ట్రంలో దాదాపు 87 వేలకు పైగా ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉన్నాయి.

9.7లక్షల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు.

– ప్రతి యూనిట్లో కనీసం 10 మంది ఉద్యోగాలు పొందుతున్నారు. ఈ రంగానికి చేయూతనివ్వకపోతే.. కుప్పకూలిపోతుంది.

– ఎంఎస్‌ఎంఈ రంగం స్తంభించి పోతే.. నిరుద్యోగం అన్ని చోట్లా పెరుగుతుంది.

– అందువల్ల 6 నెలలు, అంటే 2 త్రైమాసికాలు ఎంఎస్‌ఎంఈలకు వడ్డీమాఫీ చేయాలి.

– ఇక వ్యవసాయం విషయానికొస్తే.. ఉద్యానవన పంటలతో పాటు మరిన్ని పంటలకు కనీస మద్దతు ధరలను ప్రటించాలి.

– సేకరణలో ప్రస్తుతం ఉన్న పరిమితిని 30 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి. అన్ని రాష్ట్రాల్లో హోల్‌సేల్‌ మార్కెట్లను తెరవాలి.

– లాక్‌డౌన్‌ నిరంతర కొనసాగింపు ఆర్థికంగా కుంగదీస్తుంది. అంతర్‌రాష్ట్ర సరిహద్దుల్లో నియంత్రణ ఎత్తివేయాలి. రాకపోకలకు అనుమతి ఇవ్వాలి.

– బస్సులు, ప్రజా రవాణా వ్యవస్థలో భౌతిక దూరం పాటించడంతో పాటు, శానిటైజేషన్‌ కొనసాగుతుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.