FbTelugu

వీరటు.. వారిటు.. మరి ఓటర్లెటు?

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి వెళతారో తెలియకుండా ఉంది. టీఆర్‌ఎస్‌లో టికెట్‌ ఆశించి భంగపడిన మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరి టికెట్‌ తెచ్చుకున్నాడు. అయితే, అప్పటి వరకు టికెట్‌ ఆశించిన కాంగ్రెస్‌ నేతలు మనోహర్‌రావు, కోమటిరెడ్డి వెంకట నర్సింహారెడ్డిలు అలకబూనారు. నిన్నటి వరకు టీఆర్‌ఎస్‌లో ఉన్న శ్రీనివాసరెడ్డికి టికెట్‌ ఎలా ఇస్తారని ఆందోళనకు గురైన వారు చివరకు టీఆర్‌ఎస్‌లో చేరారు.

దీంతో దుబ్బాక రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారాయి. టీఆర్‌ఎస్‌ నుంచి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లోకి రావడంతో గులాబీ పార్టీకి కొంత నష్టం జరుగుతుందని జోరుగా ప్రచారం సాగింది. ఈ ఎన్నికలపై మరింత కష్టపడాల్సిన పరిస్థితి టీఆర్‌ఎస్‌కు వచ్చింది. అయితే, కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న అసంతృప్త నాయకులపై కన్నేసిన టీఆర్‌ఎస్‌ ఎన్నికల ఇన్‌చార్జి హరీష్‌రావు ఆ వైపుగా పావులు కదిపారు. వారితో మాట్లాడి భారీగా టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. దీంతో నియోజకవర్గ ఎన్నికల ముఖచిత్రం మరోసారి మారింది. దీంతో ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో చేరతారోనని ఓటర్లు గుసగుసలాడుతున్నారు.

అయితే, నాయకులు ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి మారుతున్నా నియోజకవర్గ ఓటర్లు ఎటువైపు మొగ్గుతారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతమంది నాయకులు ఎన్ని పార్టీలు మారినా ఓటర్లు మాత్రం తమకే అనుకూలంగా ఉన్నారని టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా ఘంటాపథంగా చెబుతున్నాయి. అయితే, ఓటర్లు ఎవరి పక్కన ఉన్నారన్న విషయం తేలాలంటే ఓట్ల లెక్కింపు దాకా ఆగాల్సిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.