FbTelugu

ఒక పార్టీ.. రెండు దారులు!

బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు విధానాలను అవలంభిస్తోంది. ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వేర్వేరు దారుల్లో పయనిస్తున్నారు. వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణపై కమలనాథులు కన్నేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని గట్టి నిర్ణయాన్ని తీసుకున్నారు.

అందులో భాగంగానే ఈ రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షులను కూడా మార్చారు. తెలంగాణలో పార్టీ పగ్గాలను బండి సంజయ్‌కు అప్పగిస్తే.. ఏపీలో సోము వీర్రాజుకు అప్పగించారు. తెలంగాణలో బండి సంజయ్‌ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌పై కత్తులు నూరుతున్నారు. దీంట్లో ఆయన చాలావరకు సక్సెస్‌ అయ్యారు కూడా. దుబ్బాక అసెంబ్లీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఆ మేరకు లాభపడింది. అధికార టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అన్న చర్చ జరిగేలా ఆయన దూకుడు పెంచారు. కానీ, ఏపీలో మాత్రం పరిస్థితి ఇక్కడకు భిన్నంగా ఉంది. అధ్యక్ష బాధ్యతలను తీసుకున్న నాటినుంచి సోము వీర్రాజు అధికార వైసీపీని పక్కన పెట్టి ప్రతిపక్ష టీడీపీపైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వాస్తవానికి అధికార పార్టీని ఇరుకన పెడితేనే బీజేపీకి అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయి.

ఏపీలో బలంగా ఉన్న పార్టీని వదిలి బలహీనంగా మారిన టీడీపీని టార్గెట్‌ చేస్తున్నారు. దీంతో ఆ పార్టీకి అక్కడ అనుకున్నట్టుగా లాభం చేకూరడం లేదన్న భావన వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో బీజేపీ–జనసేన కలిసి పోటీచేసినా పెద్దగా విజయాలేమీ సాధించలేకపోయాయి. దీనికి ప్రధాన కారణం అధికార పార్టీని టార్గెట్‌ చేయకపోవడమేనన్న విమర్శలు బీజేపీ నేతల్లోనూ వ్యక్తమవుతున్నాయి. పార్టీ పెద్దలు కూడా సోము వీర్రాజు వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీని టార్గెట్‌ చేయడంలో పూర్తిగా విఫలమైన సోము వీర్రాజును అవసరమైతే పక్కన పెట్టి కొత్తవారికి రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా అప్పగించే అవకాశాలు కూడా ఉండవచ్చని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.