FbTelugu

ప్రతిరోజు కోటి డోసుల వ్యాక్సిన్… ఇప్పట్లో కాదా?

న్యూఢిల్లీ: దేశంలో ప్రతి రోజు ఒక కోటి మందికి వ్యాక్సిన్… ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా ఆగస్టులో కార్యరూపం దాల్చుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. సెకండ్ వేవ్ ఉధృతితో మేల్కొన్న కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడంతో పాటు దిగుమతులకు అనుమతించింది.
దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్ తో పాటు కోవాగ్జిన్, స్పుత్నిక్-వి వ్యాక్సిన్లను వేస్తున్నారు. దేశ జనాభా 135 కోట్ల వరకు ఉండగా ఇప్పటి వరకు ఇరవై ఒక్క కోట్ల డోసులు మాత్రమే వేశారు. కొందరికి డబుల్ డోసు వేశారు. అధిక సంఖ్యలో సింగిల్ డోసు వేశారు. ప్రభుత్వం అనుకున్నట్లుగా ఉత్పత్తి పెరిగి, అందుబాటులోకి వస్తే ఆగస్టు మొదటి వారం నుంచి ప్రతి రోజు ఒక కోటి డోసులు ఇవ్వవచ్చని ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ మీడియాకు వెల్లడించారు. ప్రతిరోజు కోటి మంది చొప్పున వేస్తే డిసెంబర్ కల్లా పూర్తి కావచ్చని ఆయన అంచనా వేశారు.

ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో వృద్ధులతో పాటు యువకులపై వైరస్ తీవ్ర ప్రభావం చూపించింది. సెకండ్ వేవ్ లో వ్యాధి వచ్చిందని తెలుసుకునేలోపే మరణాలు సంభవించాయి. ఊపిరి ఆడక పలువురు చనిపోయారు. రానున్న థర్డ్ వేవ్ లో చిన్నారులపై అధిక ప్రభావం చూపిస్తుందని, ఇప్పటికే బ్రిటన్ లో ప్రారంభమైంది. మహారాష్ట్రలోని ఒకే జిల్లాలో 8వేల మంది చిన్నారులకు వైరస్ సోకింది.
థర్డ్ వేవ్ సన్నద్ధతపై ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నది ఇంత వరకు వెల్లడించలేదు. అమెరికా, యూరప్ దేశాల్లో చిన్నారుల వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపారు. దేశంలో కొందరు రెండు రకాల వ్యాక్సిన్లపై అనవసర చర్చ మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో రెండు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లు తీసుకుంటే ఎలా ఉంటుందంటూ షేర్ చేసుకుంటున్నారు. ఇది అత్యంత ప్రమాదమని కేంద్ర ప్రభుత్వం, వైద్య నిపుణులు చెబుతున్నా సైబర్ కేటుగాళ్లు మాత్రం ఈ వార్తను షేర్ చేస్తూ చర్చనీయాంశంగా మారారు. తొలిడోసు కోవిషీల్డ్, రెండో డోస్ కోవాగ్జిన్ తీసుకోవడం పై ఇంత వరకు పరీక్షలు జరగలేదని, శాస్త్రీయం కాదని నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు వికె.పాల్ తెలిపారు. తొలిడోసు ఏ కంపెనీ వ్యాక్సిన్ వేసుకుంటే రెండో డోసు కూడా అదే కంపెనీకి చెందినది వేసుకోవాలని స్పస్టం చేశారు. కరోనా బారిన పడిన పిల్లల్లో 2 నుంచి 6 వారాల్లో జ్వరం, చర్మంపై ఎర్రగా కావడం జరుగుతుందన్నారు. వీటితో పాటు కళ్లలో మంటలు, వాంతులు లక్షణాలు కన్పిస్తున్నాయి. ఇదంత సీరియస్ కాదని, సకాలంలో చికిత్స తీసుకుంటే సరిపోతుందని ఆయన అన్నారు. అయితే చిన్న పిల్లల వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందనేది మాత్రం వికె.పాల్ వెల్లడించలేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.