FbTelugu

ఏపిలో ఒక బ్రోకర్… తెలంగాణలో మరో బ్రోకర్: గోనె ప్రకాశ్

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ లో సజ్జల రామకృష్ణా రెడ్డి అనే బ్రోకర్ తయారయ్యాడని, తెలంగాణలో జోగినపల్లి సంతోష్ కుమార్ అనే శకుడు ఉన్నాడని మాజీ ఎమ్మెల్యే, మాజీ ఏపిఎస్ ఆర్టీసి ఛైర్మన్ గోనె ప్రకాశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు.

ఇవాళ ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, ఇద్దరు రాజకీయ బ్రోకర్లతో ప్రభుత్వాలు భ్రష్టుపట్టాయని అన్నారు. ఆంధ్రాలో సజ్జల రామకృష్ణా రెడ్డి అనే బ్రోకర్ మంత్రివర్గ సమావేశాలపై సమీక్షలు, సిఎం జగన్ రెడ్డి కుటుంబ తగాదాలు చూస్తున్నాడన్నారు. హోం మంత్రిని పక్కన బెట్టి అన్నీ ఆయనే చక్కబెడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది సిఎంలకు సలహాదారులుగా పనిచేశారని, కాని ఎవరు కూడా మీడియా ముందుకు రాలేదన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని సిఎం, సమాచార శాఖ మంత్రి లేదా మంత్రులు పత్రికాముఖంగా తెలియచేస్తారన్నారు. కాని ఏపిలో సజ్జల వెల్లడిస్తున్నారని గోనె ప్రకాశ్ రావు మండిపడ్డారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో సిఎం జగన్ బెయిల్ రద్దవుతుందని బిజెపి నాయకుడు సునీల్ దియోధర్ విమర్శించారన్నారు. ఏ క్షణమైనా బెయిల్ రద్దవుతుందని, జగన్ జైలు జీవితం తప్పదని హెచ్చరించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ అనే శకుడు ఉన్నారని అన్నారు. సిఎం కెసిఆర్ పై రెండు ఈడి కేసులు ఉన్నాయని, ఈ విషయాలు ఎక్కడైనా చెబుతానని ఆయన స్పష్టం చేశారు. సిఎం వైఎస్.రాజశేఖర రెడ్డి భార్య విజయలక్ష్మీ రాసిన నాలో నాతో వైఎస్ఆర్ పుస్తకంలో 172 పేజీలో తప్పులు రాశారన్నారు. వైఎస్ఆర్ పాదయాత్రలో జగన్ సంఘీభావంగా ఉన్నారనేది శుద్ధ అబద్దమని గోనె ప్రకాశ్ రావు ఖండించారు. అదొక తప్పుల తడక పుస్తకమన్నారు. వైఎస్ఆర్ పాదయాత్రలో ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి, డి.సుధీర్ రెడ్డి, మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ ఉన్నారని ఆయన వివరించారు. జగన్ పాదయాత్రలో ఏనాడు పాల్గొనలేదని, నిరూపిస్తే తిరుపతిలో ఉరేసుకుంటానని సవాల్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షరాలిగా ఉన్న వైఎస్.విజయలక్ష్మీ తెలంగాణలో షర్మిల దీక్షకు ఎలా మద్దతు తెలుపుతారని ప్రశ్నించారు. అనుమతి లేకుండా దీక్షలో కూర్చున్న విజయలక్ష్మీకి సిఎం జగన్ ఎందుకు నోటీసు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని గోనె ప్రకాశ్ రావు డిమాండ్ డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.