FbTelugu

రెండెకరాల కోసం తల్లి ఒంటిపై సిగరెట్ వాతలు

కర్నూలు: రెండెకరాల భూమిని దక్కించుకునేందుకు కన్నతల్లిని నిత్యం హింసిస్తూ, మానసిక వేదనకు గురి చేస్తూ, సిగరెట్లతో ఒంటిపై కాల్చాడు. కొడుకు కొట్టిన దెబ్బలను భరించింది కాని ఏనాడు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కలేదు.

చుట్టుపక్కల వారు వారించినా వృద్దురాలు అయిన తల్లిని అదే పనిగా హింసించడంతో చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పుల్లమ్మ(60) అనే వృద్ధురాలు కొడుకు చేతిలో హత్యకు గురైంది.

బనగానపల్లె సీఐ సురేశ్‌ కుమార్‌ రెడ్డి తెలిపిన మేరకు ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బనగానపల్లె మండల పరిధిలోని మిట్టపల్లె గ్రామంలో నారపురెడ్డి రామచంద్రారెడ్డి భార్య పుల్లమ్మ(60) నివాసం ఉంటున్నది. ఆమె పేరిట రెండు ఎకరాల పొలం ఉండగా, దాన్నే ఆధారంగా జీవిస్తున్నది. ఆ భూమిని తన పేరిట రాసివ్వాలని కుమారుడు ప్రసాదరెడ్డి ఆమెపై కొద్ది రోజులుగా ఒత్తిడి తెస్తున్నాడు. ఎంత అడిగినా మాట వినకపోవడంతో నిత్యం మద్యం సేవించి వచ్చి చిత్రహింసలు పెట్టేవాడు. ఈ బాధలు భరించలేక ఆమె తన పొలాన్ని బిడ్డ పేరిట రాసిచ్చింది. దీంతో మరింత ఆగ్రహానికి గురైన ప్రసాదరెడ్డి, తల్లిని నిత్యం కర్రలతో కొట్టి చిత్రహింసలు పెట్టేవాడు.

కొన్ని రోజుల క్రితం ఇదే విధంగా మద్యం సేవించి పుల్లమ్మను దారుణంగా కొట్టాడు. ఆమె అరుపులు కేకలు విన్న  పక్కింటివారు, ఎదురింటి వారు విడిపించేందుకు ప్రయత్నించగా, ప్రసాద రెడ్డి వారిని బెదిరించాడు. నానా మాటలు అనడంతో వారు ఏమీ చేయలేక వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మద్యం సేవించిన ప్రసాదరెడ్డి తల్లితో మళ్లీ వాగ్వాదానికి దిగాడు. కర్రలు, ఇతర సామగ్రితో తీవ్రంగా కొట్టడమే కాకుండా ఆమె శరీరంపై సిగరెట్లతో కాల్చాడు. తీవ్రంగా కొట్టిన దెబ్బలకు తాళలేక ఆమె ప్రాణాలు విడిచింది. ఇది చూసిన వెంటనే ఇంటికి గడియ పెట్టి తన అత్తగారు గ్రామం  అవుకు మండలం మెట్టుపల్లెకు బయలుదేరి వెళ్లాడు. ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో గురువారం ఉదయం చుట్టుపక్కల వారు తలుపులు తెరిచి చూడగా, పుల్లమ్మ విగత జీవిగా పడి ఉంది. పోలీసులు పుల్లమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.