ఏపీలో రోజు రోజుకూ పరిస్థితులు మారుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై సీఎం జగన్, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ల మధ్య పెద్ద అగాధం ఏర్పడిన విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వహణ విషయంలో ఆ ఇద్దరూ పంతానికి పోవడం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఒకరిపై ఒకరు పై ఎత్తులు వేసుకుంటూ ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నించారు. చివరకు ఇద్దరూ కోర్టులను ఆశ్రయించారు. చివరకు నిమ్మగడ్డ వైపే కోర్టులు కూడా మొగ్గుచూపాయి. హైకోర్టు ఎన్నికలు జరపాల్సిందే అని నిర్ణయించడంతో జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లినా పెద్దగా ఫలితం లేదు. దానిని వెంటనే విచారించేందుకు అనుమతి ఇవ్వలేదు.
దీంతో సోమవారం దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే, నిమ్మగడ్డ ఇప్పటికే ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఈ రోజు (శనివారం) నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తున్నారు. దీంతో జగన్ న్యాయ నిపుణులతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు బాల్ నిమ్మగడ్డ కోర్టులో ఉంది. ఇదే అదునుగా గతంలో జగన్ అండతో తనకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారుల పని పట్టే పనిలో బిజీగా ఉన్నట్టున్నారు నిమ్మగడ్డ. అనేకమంది అధికారులను ఇప్పటికే విధుల నుంచి తొలగించారు. పలువురు కలెక్టర్ల మీద చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. తన ఆదేశాలను పాటించని వారు ఏ స్థాయిలో ఉన్నా క్రమశిక్షణ చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో నిమ్మగడ్డను అడ్డుకోవడం ఎలా.. ఎన్నికలను వాయిదా వేయించడం ఎలా.. ఇప్పటివరకు తనకు అనుకూలంగా ఉన్న అధికారులను కాపాడుకోవడం ఎలా అన్న ఆందోళనలో సీఎం జగన్ ఉన్నాట్టు ఏపీలో జోరుగా ప్రచారం సాగుతోంది.
మొన్నటి వరకు చేతిలో అధికారం ఉంది కదాని జగన్ ప్రభుత్వం నిమ్మగడ్డతో ఆడుకుంటే.. ఇప్పుడు నిమ్మగడ్డ జగన్ సర్కారుతో, ఆయనకు మద్దతుగా నిలిచిన అధికారులతో ఆడుకుంటుందని రాజకీయ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నిమ్మగడ్డ వ్యవహారంతో ప్రభుత్వం, అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట. మొత్తానికి నిమ్మగడ్డ వ్యవహారాన్ని గమనిస్తున్న వారు ప్రభుత్వం, అధికారులతో నిమ్మగడ్డ మామూలుగా ఆడుకోవడం లేదుగా అంటున్నారట.