FbTelugu

ఏడాదిగా జరగంది.. ఇప్పుడు అనుకోకుండానే..!

సర్కారు కొత్త రాజకీయం వారికి అలా కలిసొచ్చింది. తెలంగాణలో వేలాది మంది పింఛన్లకు నోచుకోక ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా ఆ పథకంలో చేరుదామని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కానీ, సర్కారు వారి గోసను ఆలకించడం లేదు.

ఎప్పటికైనా పింఛన్లు రాకపోతాయా అని కళ్లల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటే.. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మాత్రం అనుకోకుండా కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది సర్కారు. అక్కడ ఒక్కచోటే ఎందుకు ప్రభుత్వం పింఛన్లు ఇస్తుందా అన్నదే కదా మీ అనుమానం. అంతేనండి సర్కారు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టు ప్రభుత్వం తలుచుకుంటే పింఛన్లు ఏం ఖర్మ.. కొండమీద కోతిని కూడా తీసుకువస్తారు. అయినా, సర్కారు ఇదంతా ఉత్తినే ఏం చేయడం లేదండి.

ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో మళ్లీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఈ ఎత్తుగడ వేసింది. ఇటీవల కాలంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి అనారోగ్యంతో మరణించారు. దీంతో ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో సోలిపేట కుటుంబానికి సహకరించేది లేదని గులాబీ తమ్ముళ్లు భీష్మించుకు కూర్చున్నారు. ఇదే అదనుగా భావించిన కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

దీంతో అక్కడ ఎలాగైనా విజయం సాధించి తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలనుకున్న సీఎం కేసీఆర్‌ ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ను రంగంలోకి దించారు. సిద్దిపేట, దుబ్బాక తనకు రెండు కళ్లలాంటివి అనుకుంటూ హరీష్‌ దుబ్బాక ఎన్నికల బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. అయితే, అక్కడ కారు జోరుకు బ్రేకులు పడేలా ఉన్నాయని ఆయన భావించారట. అందుకే తన అమ్ముల పొదిలోని బాణమైన పింఛన్లను తెరపైకి తెచ్చారట. కేవలం ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే ఇప్పుడు కొత్తగా 36వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఈ సొమ్ము జమైందట.

ఏడాది కాలంగా ఎదురుచూసినా రాని పింఛన్లు ఉప ఎన్నికల పుణ్యమా అని వచ్చినందుకు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తుంటే.. పింఛన్ల పేరుతో ఒకరకంగా టీఆర్‌ఎస్‌ ఓట్ల కొనుగోలుకు తెర లేపిందని వినక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఏదైతేనేం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పింఛన్‌ లబ్ధిదారులకు మాత్రం మంచే జరిగింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.