FbTelugu

దాడి చేస్తే నాన్ బెయిలు కేసులు

అమరావతి: కోవిడ్-19 వ్యాధిగ్రస్తుల కాంటాక్ట్స్ సర్వే  నిర్వర్తిస్తున్న సిబ్బంది పై భౌతిక దాడులు చేస్తే నాన్ బెయిలు కేసులు నమోదు చేస్తామని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఇతర సిబ్బందిపై కాంటాక్ట్ ట్రేసింగ్ సర్వే సమయంలో, రోగుల మృత దేహాల ఖననాల సందర్భముగా,  వైద్య సేవలు అందించే ఆసుపత్రులు / క్లినిక్ లు, క్వారంటైన్ / ఐసొలేషన్ కేంద్రాలు, మొబైల్ వైద్య సేవలందించే విభాగాలు, తదితర ప్రదేశాల్లో భౌతిక దాడులు జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

కరోనా వైరస్ వ్యాప్తిపై లేనిపోని అపోహలతో వైద్య సిబ్బంది విధులకు ఆటకం కలిగించ రాదని ఇప్పటికే పలుమార్లు కోరడం జరిగింది. వ్యాధిగ్రస్తుల మృత దేహాలను స్టెరిలైజ్  చేసి సీల్ చేయటం జరుగుతుంది. మృత దేహాలను పూడ్చటం లేదా కాల్చటం ద్వారా కరోనా వ్యాప్తి జరగదు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం.

ఇకనుంచి విధి నిర్వహణలో ఉన్న వైద్య / వైద్యేతర  సిబ్బంది పై జరిగే దౌర్జన్యకర సంఘటనలన్నింటినీ శిక్షార్హమైన, బెయిలుకు అవకాశం లేని నేరాలుగా పరిగణిస్తాం. కేంద్రం ఆర్డినెన్స్ ప్రకారం 3 నెలల నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధించ వచ్చు. వైద్య, వైద్యేతర  సిబ్బందిపై దాడి చేసే వారికి 6 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలు జరిమానా విధించవచ్చని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. కే.ఎస్.జవహర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

You might also like