FbTelugu

నో లాక్ డౌన్: సిఎం కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని ఆయన వ్యాఖ్యానించారు.

కరోనా పరిస్థితుల పై కెసిఆర్ గురువారం ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్నిసిఎం నిర్వహించారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లౌక్ డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించిన సిఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి కావాల్సిన వాక్సిన్లు ఆక్సిజన్ రెమిడెసివర్ సరఫరా గురించి ప్రధాని నరేంద్ర మోదీతో టెలిఫోన్ లో మాట్లాడారు. తమిళనాడులోని శ్రీ పెరంబుదూరు, కర్నాటకలోని బళ్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ అందడంలేదని ప్రధానికి తెలిపారు. మెడికల్ హబ్ గా హైదరాబాద్ మారినందున సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడే వైద్యసేవలకు వస్తున్నారని తెలిపారు. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాలనుంచి రోగులు రావడం వలన హైదరాబాద్ మీద భారం రెట్టింపు అయ్యిందన్నారు. ఇతర రాష్ట్రాల రోగుల రాకతో ఆక్సిజన్, వాక్సిన్, రెమిడెసివర్ మందుల కొరత ఏర్పడుతోందని ప్రధానికి తెలిపారు. ప్రస్తుతం రోజుకు 440 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందుతోందని దాన్ని 500 మెట్రిక్ టన్నుల కు పెంచాల్సిందిగా మోదీని కోరారు. రోజుకు 4900 వాయిల్స్ రెమిడెసివర్లు మాత్రమే అందుతున్నాయని, ఆ సంఖ్యను 25000 కు పెంచాలని కోరారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ 50 లక్షల డోసులను పంపించారని, ప్రతిరోజు 2 నుంచి 2.5 లక్షల డోసులు అవసరమవుతున్నాయని కెసిఆర్ ప్రధాని మోదీకి వివరించారు.

రెమిడెసివర్ తయారీ సంస్థలతో ఫోన్ లో మాట్లాడిన సిఎం, వాటి లభ్యతను మరింతగా పెంచాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9500 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయని వారం రోజుల్లో అదనంగా 5000 పెంచాలన్నారు. ఆక్సిజన్ సరఫరా కోసం రూ.1 కోటి రూపాయల చొప్పున 12 క్రయోజనిక్ ట్యంకర్లను చైనా నుంచి వాయు మార్గంలో అత్యవసరంగా దిగుమతి చేయాలని సిఎస్ ను సిఎం ఆదేశించారు. సెకండ్ వేవ్ లో ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి 1.56 లక్షల పాజిటివ్ కేసులు నమోదుకాగా అందులో 1.36 లక్షల మంది కోలుకున్నారని అధికారులు వివరించారు. కరోనా పరిస్థితిపై ప్రతిరోజూ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ను సిఎం ఆదేశించారు. కరోనా నియంత్రణ కోసం వైద్యశాఖ తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. మొదటి డోస్ వాక్సిన్ వేసుకున్నవారికి నిర్ణీత గడువు ప్రకారం రెండో డోస్ వేసేందుకు ప్రాధాన్యతనివ్వాలని కెసిఆర్ సూచించారు.

ప్రజలకు ఇంటికే కోవిడ్ మెడికల్ కిట్లు…

కరోనా విషయంలో ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే కోవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలన్నారు. ఆశా వర్కర్లు ఎఎన్ఎం ల ద్వారా ఇంటింటికీ అందచేస్తామన్నారు. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కరపత్రంతో పాటు మందులు అందజేస్తారని సిఎం కెసిఆర్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.