FbTelugu

గల్ఫ్ లో కొవాగ్జిన్‌ కు నో ఎంట్రీ

దుబాయ్: స్వదేశీ వ్యాక్సిన్ గా పేరుగాంచిన కోవాగ్జిన్ ను ఎగబడి తీసుకున్న వారికి ముందరి కాళ్లకు బంధంగా మారింది. కోవగ్జిన్ తీసుకున్నవారిని గల్ప్ దేశాలను అనుమతించడం లేదు. ఇప్పటివరకు యూరప్ దేశాలు తిరస్కరించగా తాజాగా గల్ఫ్ దేశాలు కూడా తిరస్కరిస్తున్నాయి.
రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న విదేశీయులను మాత్రమే అనుమతిస్తామంటూ సౌదీ అరేబియా అధికారికంగా ప్రకటించింది. అది కూడా ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, జాన్సన్‌ వ్యాక్సిన్లు తీసుకున్న వారు అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ఎయిర్‌లైన్స్‌ కు సమర్పించిన తర్వాతే దేశంలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. గల్ఫ్‌ లోని ఇతర దేశాల వారికి కూడా ఇదే రకమైన నిబంధనలను అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భారతదేశంలోని హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి అవుతున్న కొవాగ్జిన్‌కు ఇంత వరకు గుర్తింపు లభించలేదు.

డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు జాబితాలో కోవాగ్జిన్ లేదు. గల్ఫ్‌, ఉత్తర అమెరికా, ఐరోపా దేశాలేవీ కొవాగ్జిన్‌ను గుర్తించడం లేదు. సెలవులపై మాతృదేశానికి వెళ్లిన అనేక మంది ప్రవాసీయులు తమ ఆధార్‌ కార్డుల ఆధారంగా కొవాగ్జిన్‌ తీసుకున్నారు. సెలవులు పూర్తి కావడంతో ఇటీవల బహ్రెయిన్‌ మీదుగా రోడ్డు మార్గాన సౌదీ అరేబియాకు వచ్చిన అనేక మంది భారతీయులను అక్కడి అధికారులు వెనక్కి పంపించారు. కోవాగ్జిన్ తీసుకున్నామని ధృవపత్రాలు చూపించినా అంగీకరించకుండా తిప్పి పంపించారు. పాస్ పోర్టు నెంబర్ తో కాకుండా ఆధార్ నెంబర్ తో తీసుకోవడం కూడా కారణమైంది.
వ్యాక్సిన్‌ దౌత్యం పేర నరేంద్ర మోదీ విదేశాలకు పంపిన వ్యాక్సిన్లలో అత్యధికంగా కొవిషీల్డ్‌ ఉన్నాయి. కాని కొవాగ్జిన్‌ రెండు డోసులు తీసుకున్న ప్రవాసీయులు అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సకాలంలో వెళ్లకపోయినట్లయితే వేలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.