FbTelugu

ఆ వ్యాక్సిన్ వేసుకుంటే విదేశాల్లో నో ఎంట్రీ

న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానము తో అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేసుకున్నామని గొప్పగా చెప్పుకుంటున్న ఆ వ్యాక్సిన్ కు ఇంత వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అనుమతి లభించలేదు. ఫలితంగా ఆ వ్యాక్సిన్ తీసుకున్న వారు తలలు పట్టుకుంటున్నారు.
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ కంపెనీ కోవాగ్జిన్ వ్యాక్సిన్ తయారు చేసింది. స్వదేశీ వ్యాక్సిన్ అంటూ బిజెపి నాయకులతో దేశభక్తులు ఊదరగొట్టారు. నిజమేనని అనుకుని పలువురు ఈ వ్యాక్సిన్ కోసం పోటీపడి మరీ వేయించుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇప్పుడే అసలు సమస్య మొదలైంది. అంతర్జాతీయ ప్రయాణాలకు వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. రెండు డోసులు వేసుకోవడంతో పాటు, వేసుకున్నట్లు సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకున్న పలువురు విదేశాలకు వెళ్లేందుకు టికెట్ కొనుగోలు సమయంలో కోవాగ్జిన్ సర్టిఫికెట్ జత చేస్తున్నారు. అయితే ఈ సర్టిఫికెట్లను యురోపియన్ దేశాలు అంగీకరించడం లేదు. పలు దేశాలు డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. డబ్ల్యూహెచ్ఓ అత్యవసర వినియోగ జాబితాలో కోవాగ్జిన్ కు ఇంత వరకు చోటు లభించలేదు.

అనుమతి కోసం కోవాగ్జిన్ దరఖాస్తు చేయగా, మరింత సమాచారం కావాలని డబ్ల్యూహెచ్ఓ తిరుగు టపా పంపించింది. ఆ వివరాలను పంపించకపోవడంతో అనుమతించలేదని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి ప్రకటించారు. దీంతో కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోని వారి కిందే ఇతర దేశాలు జమకడుతుండడం గమనార్హం. డబ్ల్యూహెచ్ఓ జాబితాలో సిరం ఇనిస్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ తో పాటు ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, ఫైజర్, జాన్ సెన్, సినోఫామ్ వ్యాక్సిన్లు మాత్రమే ఉన్నాయి. అంతర్జాతీయ ప్రయాణాలకు వెళ్లేవారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మరీ మంచిది.

You might also like

Leave A Reply

Your email address will not be published.