FbTelugu

కట్టడి ఆగింది.. కేసులు పెరిగాయి!

ఇండియాలో కరోనా యమా స్పీడుగా విజృంభిస్తోంది. మార్చి నుంచి ఏప్రిల్‌ వరకు వందల్లో ఉన్న కేసులు జూన్‌ నాటికి లక్షల్లోకి చేరుకున్నాయి. మరణాలు కూడా వేలల్లో ఉన్నాయి. ఇప్పుడు కరోనా కేసులు రోజుకు పదివేల దాకా నమోదవుతున్నాయి.

మరణాలు కూడా రెండు వందలకు తగ్గడం లేదు. కరోనా కట్టడి కాలంలో అదుపులో ఉన్న కేసులు కట్టడికి తిలోదకాలు ఇవ్వడంతో కేసుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. కరోనా కేసుల విషయంలో  ప్రపంచంలో ఎక్కడో అడుగున ఉన్న ఇండియా ఇప్పుడు కేసుల విషయంలో రోజుకో దేశాన్ని దాటి ముందుకు వెళుతోంది. దేశంలో కరోనా ప్రభావం పెరుగుతూనే ఉంది. కేసుల విషయంలో భారత్‌.. స్పెయిన్‌ను అధిగమించింది. దీంతో ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో ఐదో స్థానానికి చేరుకుంది.

తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 9,887 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకూ ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. ఇదే సమయంలో 294 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,45,670కి చేరింది. వైరస్‌ మరణాల సంఖ్య 6,642కు పెరిగింది. ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్, రష్యా, స్పెయిన్, యూకేలు ఉన్నాయి. మరో రెండు రోజుల్లో భారత్‌ యూకేను అధిగమించి ఐదో స్థానానికి చేరడం ఖాయంగా కనిపిస్తున్నది. అయితే, భారత్‌లో నమోదైన మొత్తం కేసుల్లో 58 శాతం మంది వైరస్‌ బాధితులు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లోనే ఉన్నారు.

బెంగాల్‌లో ఇద్దరు జడ్జీలకు..

బెంగాల్‌లోని అలీపూర్‌ జిల్లా న్యాయస్థానంలోని విధులు నిర్వహిస్తున్న ఇద్దరు న్యాయమూర్తులకు కరోనా సోకింది. వారు ప్రస్తుతం కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఆ రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 7,303 చేరింది. వీరిలో 366 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,025 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అదేవిధంగా తమిళనాడులో కరోనా తీవ్రరూపం దాలుస్తున్నది. కొన్ని రోజులుగా వేలల్లోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 30 వేలు దాటింది. రాష్ట్రంలో తాజాగా 1,458 పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 30,152కు చేరింది. అలాగే, మరో 19 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 251కి పెరిగింది.

అయితే, రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 70 శాతం చెన్నైలోనే చోటుచేసుకోవడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. చెన్నైలో వైరస్‌ కేసులు సంఖ్య 20,993కు పెరిగింది. వీరిలో 197 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటు ఉత్తరప్రదేశ్‌లోనూ కరోనా వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. తెలంగాణ, ఏపీల్లోనూ కరోనా తీవ్రతరమైంది. శనివారం ఈ రెండు రాష్ట్రాల్లో రెండు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఒక్క రోజే పదిమంది మరణించారు.

తెలంగాణ సీఎంఓ మూసివేత

తెలంగాణలో పరిస్థితి చేయిదాటుతోంది. ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా కరోనా వేడి తగిలింది. దాదాపు పదిమంది అధికారుల దాకా వైరస్‌ బారిన పడడంతో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని (సీఎంఓ)ను కూడా మూసివేయాల్సి వచ్చింది.

You might also like