FbTelugu

వామ్మో… కొత్తగా 38 ఎల్పీజీ దహన వాటికలు

నవంబరు నాటికల్లా అందుబాటులోకి

విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా 35 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.51.48 కోట్ల అంచనా వ్యయంతో కొత్తగా 38 కొత్త ఎల్పీజీ దహన వాటికలను నిర్మిస్తున్నారు.
రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి కనీసం ఒకటి చొప్పున ఉండేలా చేపట్టిన ఈ పనులకు సంబంధించిన టెండరింగ్ ప్రక్రియను పూర్తి చేసి, వచ్చే నవంబరు నెలాఖరు కల్లా అందుబాటులోకి రానున్నాయి.
ఇటీవలి కాలంలో కొన్ని చోట్ల అంతిమ సంస్కారాల నిర్వహణలో దురదృష్టకరమైన కొన్ని అమానవీయ సంఘటనలు చోటుచోసుకున్నాయి. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి, పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశలో ప్రభుత్వం దహన వాటికల నిర్మాణం చేస్తోంది. కరోనా పరిస్థితుల దృష్ట్యా అమలులో ఉన్న ఆంక్షలను (మినిమమ్ కాంటాక్ట్) దృష్టిలో ఉంచుకుని, అంత్యక్రియలనేవి గౌరవప్రదమైన రీతిలో జరిగేలా అన్ని చర్యలు తీసుకుటున్నారు.

పట్టణ ప్రాంతాల్లో మరణించిన వారి అంతిమ సంస్కారాల నిర్వహణకు సరైన సదుపాయాలు లేని విషయాన్ని గమనించిన ప్రభుత్వం సంప్రదాయ విధానం కాకుండా ఆధునిక పద్దతుల్లో దహన సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించింది. కరోనా పరిస్థితులు, సంప్రదాయబద్ధంగా కర్రలను ఉపయోగిస్తున్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పర్యావరణ హితమైన ఏర్పాట్లు ఉండేలా చూడాలని సీఎం జగన్ రెడ్డి ఆదేశించారు.
పర్యావరణ హితంగా, ఎల్పీజీ తో నిర్వహించేలా దహన వాటికల నిర్మాణం చేయనున్నారు. శ్మశానాల్లో మౌలిక వసతుల కల్పన వంటివి ఈ పనుల్లో భాగంగా చేపట్టనున్నారు. రూ.51.48 కోట్లలో 37 దహనవాటికల ఏర్పాటుకు రూ.15.92 కోట్లు, 35 శ్మశానాల్లో వసతుల కల్పనకు రూ.35.56కోట్లను ఖర్చు చేయనున్నారు.
హిందూపుర్, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గాల్లో 3 చొప్పున దహన వాటికలు, నర్సాపురం, మచిలీపట్నం, గుంటూరు, నర్సరావుపేట, ఒంగోలు, కడప, కర్నూలు, విశాఖ పార్లమెంటు నియోజకవర్గాల్లో 2 చొప్పున, మిగిలిన నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున వీటిని ఏర్పాటు చేయనున్నారు. నవంబరు నెలాఖరు నాటికల్లా ఇవి అందుబాటులోకి రానున్నాయి.

You might also like