FbTelugu

వారికి కొత్త టెన్షన్‌!

తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. అది ప్రధానంగా విద్యాసంస్థలను అతలాకుతలం చేస్తోంది. ప్రతిరోజూ వందల మందికి వైరస్‌ సోకుతోంది. ప్రధానంగా గురుకులాలు, హాస్టళ్లలో ఈ సమస్య వెంటాడుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలు మినహా మిగతా విద్యాసంస్థలను, హాస్టళ్లు, గురుకులాలను వెంటనే మూసివేయాలని మంగళవారం నిర్ణయించింది.

బుధవారం వరకు విద్యార్థులనందరినీ ఇళ్లకు పంపి విద్యాసంస్థలను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి పాఠశాలలు తెరిచి నెల రోజులు మాత్రమే అయింది. గురుకులాలు, పదో తరగతి విద్యార్థులకు మాత్రం కొంచెం ముందుగా ఆఫ్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నాయి. నెల రోజుల క్రితం అదీ ఆకస్మికంగా ప్రాథమిక పాఠశాలలను కూడా తెరిచారు. అయితే, ఇదంతా ప్రైవేటు విద్యాసంస్థల కోసమేనని.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారిని తమవైపునకు తిప్పుకునేందుకే కరోనా పెరుగుతున్న సమయంలో పాఠశాలలను తీస్తున్నారని విపక్షాలు అప్పట్లోనే ఆరోపణలు చేశాయి. అయినా, సర్కారు ఏమీ పట్టించుకోలేదు. సరే, ఈ రాజకీయాలు పక్కనపెడితే విద్యాసంస్థలను కరోనా గడగడలాడిస్తుండడంతో చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాసంస్థలను మూసివేసి తిరిగి ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభుత్వం కూడా స్పందించింది. ఒక్క మెడికల్‌ కాలేజీలు మినహా మిగతా అన్నిరకాల కాలేజీలు, పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాలు తదితర విద్యాసంస్థలన్నీ మూసివేయాలని ప్రకటించింది.

మరి ఇదేం మెలిక?
విద్యాసంస్థలను, హాస్టళ్లను బుధవారం నుంచే (24వ తేదీ) మూసివేయాలని ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం పరీక్షలు మాత్రం యథావిధిగా జరుగుతాయని ప్రకటించింది. దీంతో విద్యార్థులు ఇదేం మెలికరా బాబూ అంటూ తలలు పట్టుకుంటున్నారు. హాస్టళ్లన్నీ మూసేస్తే తాము ఎక్కడ ఉండి పరీక్షలకు హాజరు కావాలని దూర ప్రాంత విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన చంద్రకళ మేడ్చల్‌ సమీపంలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతోంది. అక్కడ ఓ ప్రైవేటు హాస్టల్‌లో నాలుగేళ్లుగా ఉంటోంది. ఇప్పుడు ప్రభుత్వ ఆర్డర్‌ ప్రకారం హాస్టల్‌ మూసివేస్తున్నట్టు హాస్టల్‌ నిర్వాహకులు చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఉండడానికి చోటులేక.. పరీక్షలకు ఎలా హాజరు కావాలో తెలియడం లేదని ఆమె వాపోతుంది. ఇప్పటికే బీటెక్‌ పరీక్షలు సగం పూర్తయ్యాయి. మిగతా సగం పూర్తి కావాల్సి ఉంది. డిగ్రీ పరీక్షలు కూడా ఏప్రిల్‌ మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ కోర్సులు చదువుతున్న వందలాది మంది విద్యార్థులు దూర ప్రాంతాలకు చెందిన వారే. ఇప్పుడు ప్రభుత్వ హాస్టళ్లతో పాటు ప్రైవేటు హాస్టళ్లు కూడా మూసివేస్తుండడంతో తాము పరీక్షలకు ఎలా హాజరు కావాలన్న ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం ఇలాంటి చర్య ఎలా తీసుకుందా అని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హాస్టళ్లతో పాటు పరీక్షలు కూడా వాయిదా వేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.