టీపీసీసీ అధ్యక్ష పదవికి కొత్త నేత ఎంపిక వ్యవహారం యమా స్పీడుగా నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర బాస్‌గా ఎవరు ఉండాలనే దానిపై కేంద్ర నాయకత్వం దృష్టి సారించింది. అయితే, ఈ సారి నేతలందరి అభిప్రాయాలను తెలుసుకొని నేతను ఎంపిక చేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రాష్ట్ర నేతలతో మూడు రోజుల పాటు మాట్లాడి వారి వివరాలను తెలుసుకున్నారు. వారి అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి సమర్పించారు. అయితే, టీపీసీసీ పదవికి అనేకమంది పోటీ పడినా ప్రధాన పోటీ మాత్రం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్యే ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, కోమటిరెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అనేకసార్లు నల్లగొండ ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం భువనగిరి ఎంపీగా కొనసాగుతున్నారు. ఇక రేవంత్‌రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. రాజకీయాల్లో ఆయన సీనియరే అయినా కాంగ్రెస్ పార్టీలో ఆయన జూనియర్, పార్టీ అధిష్టానం దృష్టిలో మాత్రం కొద్ది కాలానికే ఫైర్‌బ్రాండ్‌గా స్థానం సంపాదించారు. సోనియా, రాహుల్‌గాంధీలను నేరుగా కలవగల స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే ఆయనకు ధీటుగా మాట్లాడగల సత్తా ఉన్న నాయకుడు కావాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు వినికిడి. ఈ కోణంలో చూస్తే రేవంత్‌ను మించిన వారు లేరు.
కానీ, రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు మాత్రం రేవంత్‌రెడ్డికి పీసీసీ పదవి ఇవ్వడం ఇష్టం లేనట్టుగా ప్రచారం సాగుతోంది. గతంలోనే కొందరు కాంగ్రెస్ పెద్దలు రేవంత్‌కు వ్యతిరేకంగా ఎలా పనిచేయాలనే విషయంపై మాట్లాడేందుకు ఓ హోటల్లో సమావేశమైనట్టు ప్రచారం సాగింది. ఇప్పుడు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదిపే పనికి స్పీడు పెంచినట్టు కనిపిస్తోంది. మొదటి నుంచీ ఉన్న వారిని కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి పీసీసీ పదవి ఇవ్వవద్దని మరోసారి అధిష్టానానికి సూచించే పనిలో ఉన్నట్టు సమాచారం. అవసరమైతే కోమటిరెడ్డికి పదవి ఇచ్చినా కలిసి పనిచేస్తామని కూడా చెబుతున్నారట. అందుకే పాత నేతల మద్దతుతో తన వినతిని అధిష్టానానికి చెప్పుకునేందుకు కోమటిరెడ్డి ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో అసలే అనేక రకాల గ్రూపులు ఉన్నాయి. వాటిని సమన్వయం చేసుకోలేక ప్రతిసారీ నష్టపోతున్నారు. ఇలాంటి తరుణంలో పీసీసీ నేత ఎంపిక విషయంలో పాత నేతలంతా ఒక్కతాటిపై ఉన్నామన్న సంకేతాలు పంపితే తప్పకుండా రేవంత్‌కు చెక్ పడుతుందన్న భావనలో వారున్నట్టు ప్రచారం సాగుతోంది. మరి అధిష్టానం ఏం ఆలోచిస్తుందో.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.