కరోనా దెబ్బకు పట్నం పల్లెలు తేడా లేకుండా తల్లడిల్లుతున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యాసంస్థలు నడపడం అసాధ్యంగా మారింది. ఇప్పటికే అనేక పరీక్షలను రద్దుచేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశాయి ప్రభుత్వాలు. ఈ విద్యా సంవత్సరంలో కూడా విద్యాసంస్థలు తెరుచుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించాయి. అయితే, విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు వినాలంటే కంప్యూటరో, ట్యాబో, కనీసం ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలి.
దానికి నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. ఇప్పటి వరకు చాలామందికి ఆండ్రాయిడ్ ఫోన్ సౌకర్యం కూడా లేదు. ప్రధానంగా పల్లె ప్రాంతాల్లో నివశిస్తున్న పేదలకు ఫోన్ ఉన్నా అవి సాధారణమైనవే ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ కొనే స్థోమత లేనివారు చాలామంది ఉన్నారు. కానీ, ఇప్పుడు ఆ కుటుంబాలకు చెందిన విద్యార్థులు తమ చదువులు కొనసాగించాలంటే ఆండ్రాయిడ్ ఫోన్ తప్పనిసరిగా కొనాల్సి వచ్చింది. ఈ ఫోన్ ధర తక్కువలో తక్కువగా పదివేల రూపాయల దాకా ఉంటుంది. అసలే కరోనా కాలంలో ఉపాధి దొరకడం లేదు. కుటుంబం బతకడానికే కష్టమవుతున్న తరుణంలో అంత డబ్బు పెట్టి ఫోన్ కొనాలంటే ఎలా అని పేద కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి.
ఒక ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే వారు రెండు ఫోన్లు కొనాల్సి ఉంది. పోన్ కొనడమే కాదు. దానికి నెట్ సౌకర్యం కూడా కల్పించాలి. అందుకోసం ప్యాకేజీలు కనీసం నెలకు 400 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఇంత చేసినా గ్రామాల్లోకి నెట్ సిగ్నల్స్ సరిగ్గా వస్తాయో రావో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో పిల్లలకు అంత డబ్బులు పెట్టి ఆన్లైన్ క్లాసులు వినిపించాలంటే తలకుమించిన భారంగా పరిణమించిందని పేద కుటుంబాల వారు ఆందోళనకు గురవుతున్నారు.