FbTelugu

కొత్త శకం ఆరంభం: మోహన్ భాగవత్

లక్నో : భారత దేశంలో ఓ కొత్త శకం ప్రారంభమైందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భగవత్ ఆనందం వ్యక్తం చేశారు. ’వసుధైక కుటుంబం‘ అన్న వాక్యాన్ని భారతావని పూర్తిగా విశ్వసిస్తుందని, మన దేశ వాసులకున్న ఈ స్వభావమే ప్రతి సమస్యకు ఓ పరిష్కారాన్ని కనుగొనగలదని ఆయన అన్నారు.

అయోధ్య లో రామ మందిర భూమిపూజ తర్వాత జరిగిన బహిరంగ సభలో ఆయన ప ప్రసంగించారు. మందిర నిర్మాణం కోసం మరో 20 నుంచి 30 ఏళ్ల పాటు పోరాటం చేయాలని, అప్పుడే అది ఫలిస్తుందని సంఘ్ పూర్వ సరసంఘ చాలకులు బాలాసాహేబ్ దేవరస్ అనేవారని గుర్తు చేసుకున్నారు. ఆ విషయం ఇంకా గుర్తుందని అన్నారు. ఈ మందిర నిర్మాణం కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మంది పోరాటాలు చేశారని, ఆ జాబితాలో కొందరు కాలం చేసినా, మరికొందరు ఇప్పటికీ జీవించి ఉన్నారని తెలిపారు. అయోధ్య రథయాత్ర ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఎల్‌కే అద్వానీ ఇంట్లోనే కూర్చుండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారని అన్నారు. రామ మందిర నిర్మాణమే ఊపిరిగా చాలా మంది బతికి… శరీరం విడిచిపెట్టారని… వారందరూ సూక్ష్మ రూపంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారని అన్నారు.

దేశంలో ఇప్పటికే ఉన్న లక్షలాది దేవాలయాల మాదిరిగానే ఈ అయోధ్య మందిర నిర్మాణం కాదని, ఈ దేవాలయాల ఆశయాలు ఏవైతే ఉన్నాయో… వాటన్నింటినీ తిరిగి మననం చేసుకుంటూ వాటిని సాధించే దిశగా అడుగులు వేయడమే ఈ మందిర నిర్మాణ లక్ష్యమని మోహన్ భగవత్ పునరుద్ఘాటించారు.

You might also like