FbTelugu

నీట్‌గా కొంప ముంచారు..!

పెద్దలు చేసిన ఓ పొరపాటు ఓ విద్యార్థి కొంప ముంచింది. కేవలం నిమిషాల తేడాతో అనేకమంది విద్యార్థుల భవిష్యత్‌ నాశనం అవుతోంది. నిమిషం ఆలస్యం పేరుతో విద్యార్థులను పరీక్షకు హాజరు కానీయకపోవడంతో వారు చాలా నష్టాల పాలవుతున్నారు.

ఇదంతా జరుగుతోంది ఆ విద్యార్థుల నిర్లక్ష్యం వల్ల కాదు. ప్రభుత్వాలు, విద్యాశాఖ అధికారుల నిర్ణయం వల్ల. ఓ విద్యార్థి నీట్‌ పరీక్షకు కష్టపడి చదివాడు. నీట్‌లో సీటు కొట్టడం ఖాయమన్న సంతోషంలో ఉన్నాడు. కానీ, సర్కారు విధానాలు ఆ విద్యార్థి ఆశలు, ఆశయాలపై దెబ్బకొట్టాయి. కేవలం పది నిమిషాలు ఆలస్యంగా వచ్చాడన్న కారణంగా అతడిని పరీక్షకు అనుమతించలేదు. దీంతో తన కెరీర్‌ మొత్తం నాశనం అయిందని ఆ విద్యార్థి బోరున ఏడ్చాడు. ఇది చదువుతుంటే మీకేమి అనిపిస్తుందో నాకు అర్ధమైంది. పరీక్ష సమయం తెలుసు కదా.. పది నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి పది నిమిషాల ముందుగానే చేరుకోవచ్చుగా అని ఉచిత సలహా ఇవ్వాలనిపిస్తుంది కదా.. కానీ, అది అతడి నిర్లక్ష్యం కాదు.. సాక్షాత్తూ నీట్‌ నిర్వాహకులది.

ఎలా అంటారా.. ఆ విద్యార్థి పేరు సంతోష్‌. ఉండేది బిహార్‌ రాష్ట్రంలో. కానీ నీట్‌ నిర్వాహకులు అతడి పరీక్షా కేంద్రాన్ని 700 కిలోమీటర్ల దూరంలోని పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతాలో వేశారు. ఒక రాష్ట్రంలో ఉండే విద్యార్థికి మరో రాష్ట్రంలో పరీక్ష కేంద్రం కేటాయించారు. అయినా, కష్టపడి చదివాను కాబట్టి ఎంత ఇబ్బంది అయినా, పరీక్ష రాసి నీట్‌ కొట్టాలనుకున్న ఆ విద్యార్థి ఇంటినుంచి కోల్‌కతాకు బయలుదేరాడు. సొంతూరు నుంచి శనివారం ఉదయం ముజఫర్‌పూర్‌ నుంచి పాట్నాకు వచ్చాడు. ఆ రాత్రి అక్కడ బస్సెక్కితే ఆదివారం మధ్యాహ్నం 1.06గంటలకు కోల్‌కతాకు బస్సు చేరింది.

అక్కడి నుంచి ట్యాక్సిలో పరీక్ష కేందానికి వెళ్లేటప్పటికి పది నిమిషాలు లేట్‌ అయ్యింది. దీంతో పరీక్ష కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు. దీంతో అతడు ఏడాది కాలం వృథా అయింది. దీనికి కారణం ఎవరో ఇప్పుడు చెప్పండి. తప్పు చేసింది ఎవరు..? ఫలితం అనుభవించింది ఎవరు..? పెద్దలు చేస్తున్న ఇలాంటి పొరపాట్లకు సామాన్యులు ఎందరో ఇలా బలవుతున్నా.. పట్టించుకునేవారే కరువయ్యారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

You might also like