సూదికోసం సోదికెళితే పాత కథలు బయటపడ్డాయట. అలా ఉంది ఇప్పుడు అక్కడ పరిస్థితి. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు పెద్దలు. అలాంటి నిజాలే ఇప్పుడు బయట పడుతున్నాయి. ఇద్దరు మిత్రులు ఒక్కటిగా ఉన్నప్పుడు చేసిన దారుణాలు వారి మధ్య వైరం పెరగడంతో వారు చేసిన ఆగడాలను ఒకరివి ఒకరు బయట పెట్టుకుంటున్నారు. ఏమిటి ఇదంతా.. దేనిగురించి చెబుతున్నారు అనుకుంటున్నారు కదా. అదేనండి.. వెస్ట్ బెంగాల్లో గతంలో జరిగిన నందిగ్రామ్ కాల్పుల వ్యవహారం గురించి. నందిగ్రామ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు అప్పటి లెఫ్ట్ సర్కారు కొంత భూమిని సేకరించింది. అయితే, రైతులు తమ పొలాలను పరిశ్రమలకు ఇవ్వబోమని ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అనేకమంది రైతులు ప్రాణాలను కోల్పయారు. ఈ కాల్పులకు అప్పటి సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య నేతృత్వంలోని లెఫ్ట్‌ఫ్రంట్ సర్కారే కారణమని ఇప్పటి సీఎం మమత, అప్పటి ఆమె సన్నిహితుడు.. ఇప్పుడు ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు ఆరోపించారు. ఈ పంచాయితీని వేదికగా చేసుకొని ప్రభుత్వంపై విష ప్రచారం చేశారు.
ఆ తర్వాత అక్కడి ఓటర్లు కూడా ప్రభుత్వ ఆదేశాలతోనే పోలీసులు కాల్పులకు తెగబడ్డారని నమ్మారు. అనంతరం అక్కడ జరిగిన ఎన్నికల్లో ఓటర్లు లెఫ్ట్‌ఫ్రంట్ సర్కారుకు వ్యతిరేకంగా మమతకు అనుకూలంగా ఓట్లేశారు. ఆ ఎన్నికల్లో వామపక్ష ప్రభుత్వం పడిపోయి మమత అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా మమత నందిగ్రామ్ కాల్పులకు వామపక్ష సర్కారే కారణమని చెబుతూ వచ్చింది. కానీ, ఆమె మిత్రుడు సువేందు ఆమెతో విభేదించి బయటకు వచ్చిన తర్వాత అసలు నిజాన్ని బయటపెట్టారు మమత. నందిగ్రామ్‌లో రైతులపై కాల్పులు జరిపింది పోలీసులు కాదని.. సువేందు గూండాలు పోలీసు వేషంలో రైతులపై కాల్పులు జరిపి.. ఆ నెపాన్ని ప్రభుత్వంపైకి నెట్టారని ఆరోపించారు. దీనికి స్పందించిన సువేందు అప్పుడు రైతులపై దూసుకెళ్లిన ప్రతి తూటా మమతకు తెలిసే జరిగిందని వ్యాఖ్యానించారు. అంటే మమత, సువేందు ఇద్దరూ కలిసే ఈ దారుణానికి ఒడిగట్టారన్న విషయం అర్ధం అవుతుంది. ఇప్పుడు బెంగాల్ ఎన్నికల్లో వీరి వ్యాఖ్యలే హాట్ టాపిక్‌గా మారాయి. అప్పట్లో కాల్పులకు.. ప్రభుత్వానికి సంబంధం లేదని సర్కారు చెప్పినా మమత అండ్ కో చేసిన ప్రచారంతో బుద్ధదేవ్ సర్కారును ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు ఆ విషయాలను అమలు చేసి రైతుల మరణానికి తామే కారకులమని ఇన్‌డైరెక్టుగా మమత, సువేందు ఒప్పుకున్నట్టేనని బెంగాల్లో రాజకీయవేత్తలు, ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే, ఇప్పుడు మమత, సువేందు దారుణాలు బయటకు రావడంతో ఈ పరిణామాలు ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపుతాయో చూడాలి మరి.