FbTelugu

కామ్రేడ్లలో కలకలం!

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అందివచ్చిన అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటున్నాయి. ఇదంతా పోటీలో ఉన్న పార్టీల నేతలు పడుతున్న మల్లగుల్లాలు. కానీ, ఇక్కడ పోటీ కూడా చేయని సీపీఎం, సీపీఐలు కూడా మల్లగుల్లాలు పడుతోంది. ఇక్కడ తాము పోటీలో లేము కాబట్టి తమ కార్యాచరణ ఎలా ఉండాలోనన్న విషయంలో చర్చల మీద చర్చలు సాగించాయి. చివరకు అధికార పార్టీకి మద్దతుగా నిలవాలని ఆ పార్టీల జిల్లా కమిటీలు నిర్ణయించాయి. దీంతో ఆ పార్టీల స్థానిక నాయకులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైనట్టు ప్రచారం సాగుతోంది. వాస్తవానికి ఇక్కడ నుంచి పోటీకి దిగుతారన్న ఆలోచనతో సీపీఎం జిల్లా నాయకుడు ఒకరు సాగర్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ వెలువడక ముందే పాదయాత్ర నిర్వహించి నియోజకవర్గాన్ని చుట్టి వచ్చారు. ఇటీవల కాలంలో ఏ ఎన్నికలు జరిగినా స్థానిక నేతల అభిప్రాయం మేరకు స్థానిక నేతలకే టికెట్‌ కేటాయిస్తూ వస్తోంది. అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా అదే విధానాన్ని అనుసరిస్తుందని, దీంతో టికెట్‌ తనకే వస్తుందన్న నమ్మకంతో ఆ నేత పాదయాత్ర పూర్తిచేశారు. కానీ, ఆయన ఆశలకు గండికొట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పార్టీ రాష్ట్ర నాయకత్వం తేల్చి చెప్పింది. ఈ నిర్ణయంతోనే స్థానిక నాయకులు డీలా పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అధికార టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించడం పట్ల స్థానిక నేతలు, కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట. వాస్తవానికి వామపక్షాలను అణిచివేసే చర్యలను కేసీఆర్‌ పూర్తిస్థాయిలో అమలు పరుస్తున్నారు. ఆ విధానంలో భాగంగానే సీపీఎం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా, శాసనసభా పక్ష నేతగా వ్యవహరించిన దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యను కూడా టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. వాస్తవానికి నోముల సీపీఎంలో ఉన్నప్పుడు ఆయన పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దానిపై పార్టీ కమిటీల్లో కూడా అనేకసార్లు చర్చలు జరిగినట్టు ప్రచారం జరిగింది. ఒక దశలో ఆయనపై పార్టీ సీరియస్‌గా కూడా ఉండడంతోనే ఆ ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ నిరాకరించినట్టు సమాచారం. దీంతో నోముల కూడా పరిస్థితిని గమనించి సీపీఎంను వదిలి టీఆర్‌ఎస్‌లో చేరారు. అంతేకాదు.. సీపీఐ నుంచి గెలిచిన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ను కూడా కేసీఆర్‌ కారెక్కించుకున్నారు. ఇలా పార్టీని బలహీనం చేయడంతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేసీఆర్‌ను సీపీఐ, సీపీఎం ఎప్పుడూ విమర్శలతో ముంచెత్తుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న వరకు తిట్టిన పార్టీకి ఇప్పుడు ఎలా మద్దతు పలుకుతామని స్థానిక క్యాడర్‌ నిప్పులు చెరుగుతోంది. వాస్తవానికి తమకు మద్దతు ఇవ్వాలని వామపక్షాలను పీసీసీ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. టీఆర్‌ఎస్‌ మాత్రం కనీసం మద్దతు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేయలేదు. అయినా, టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనలో స్థానిక క్యాడర్‌ ఉంది.

ఇదేం లాజిక్కో..

సాగర్‌లో వామపక్షాల మద్దతు భలే గమ్మత్తుగా అనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలట.. కానీ, ఆ విషయం ఎక్కడా బయటకు చెప్పకూడదట.. ఆ పార్టీకి ఓట్లు వేయాలని అడగకూడదట. క్యాడర్‌ ఓట్లు మాత్రం బదలాయించాలట. వాస్తవానికి వామపక్ష నేతలు బీజేపీని నిలువరించేందుకే టీఆర్‌ఎస్‌కు మద్దతునిస్తున్నామని చెబుతున్నారు. అంటే బీజేపీని ఓడిపోవాలంటే టీఆర్‌ఎస్‌ గెలవాలి అనేది వారి ఉద్దేశం. అలాంటప్పుడు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నేరుగా ప్రచారం చేస్తే వారి ఆకాంక్ష తీరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయిగా. ఇలా చాపకింద నీరులా వ్యవహరించడం వల్ల పార్టీ క్యాడర్‌ కూడా ఒక కట్టులా కాకుండా ఎవరికి వారుగా చెల్లాచెదురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల రేపు పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశాలున్నాయని స్థానిక క్యాడర్‌ కలవరపడుతోంది. ఏదైనా గతి తార్కిక భౌతికవాదాన్ని అనుసరించే వామపక్షాలు ఇలా కర్ర విరగకుండా.. పాము చావకుండా అన్న రీతిలో నిర్ణయం తీసుకొని పార్టీ క్యాడర్‌ను గందరగోళంలో పడేస్తున్నారెందుకో అన్న అనుమానాలను స్థానిక నేతలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాజకీయాల్లో మద్దతు అంటే కొత్త అర్ధానికి తెరలేపారన్న విమర్శలు వామపక్షాలపై వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ నిర్ణయం వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయో ఆ పార్టీల నేతలకే తెలియాలి.

You might also like

Leave A Reply

Your email address will not be published.