FbTelugu

9 మంది మృతి కేసులో వీడిన మిస్టరీ?

అక్రమ సంబంధమే సామూహిక హత్యలకు కారణం

పోలీసుల విచారణలో వెల్లడి

వరంగల్‌: పోలీసులు అనుమానించిన విధంగానే ఒక మహిళ అక్రమ సంబంధం కారణంగా 8 మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఒక కుటుంబం సామూహికంగా హత్యకు గురైంది.

వరంగల్ నగర శివారులో మూడు రోజుల క్రితం జరిగిన సామూహిక హత్యల మిస్టరీనీ పోలీసులు సవాల్ గా తీసుకుని ఛేదించారు. పోలీసుల విచారణలో వెల్లడించిన సమాచారం కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తను ప్రేమించిన యువతి బుస్రా ను కన్నేయడంతో పాటు, అడ్డుగా రావడంతో మొత్తం 9 మందిని సామూహికంగా హత్య చేసినట్లు ప్రియుడు సంజయ్ కుమార్ యాదవ్ పోలీసుల విచారణలో అంగీకరించారు. కుటుంబ పెద్ద, బుస్రా తండ్రి మక్సూద్ తో పాటు ఏడుగురికి, మరో ఇద్దరి బిహారీలకి నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసినట్లు తెలిపాడు. ఆ తరువాత ఒకరి తరువాత మరొకరిని గోనె సంచుల్లో పెట్టి పక్కనే ఉన్న బావిలో పడేశానన్నారు.

మక్సూద్ తన కుమార్తె బుస్రాను ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. భర్తతో పొసగక పోవడంతో ఆమె అతన్ని విడిచిపెట్టి తండ్రి వద్దకే వచ్చి నివాసం ఉంటోంది. లాక్ డౌన్ కారణంగా కుటుంబం మొత్తం నగర శివారు గొర్రెకుంటలోని గన్నీ సంచుల గోదాంలో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. భర్తతో విడిపోయిన మక్సూద్ కూతురు బుస్రా నగరంలోని సంజయ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ విషయమై బుస్రాకు, తల్లితో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.

ఇంటిపై ఉంటున్న బీహార్‌కు చెందిన కార్మికులు శ్రీరాం, శ్యామ్‌లు వీరి గొడవలో జోక్యం చేసుకున్నారు. న్యాయం చేస్తామని చెప్పి బుస్రాపై కన్నేసినట్లు తెలియవచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సంజయ్ కుమార్ కంగు తిన్నాడు. తన ప్రియురాలిపైనే కన్నేస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. పథకం ప్రకారం ఇద్దరి బిహారీలు, మక్సూద్ కుటుంబాన్ని సామూహికంగా హతమార్చాడు.

20 ఏళ్ల క్రితం నగరానికి

పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన మహ్మద్ మక్సూద్‌ రెండు దశాబ్ధాల క్రితం బతుకుదెరువు కోసం వరంగల్‌కు వచ్చాడు. వలస వచ్చిన మక్సూద్ వరంగల్ లోనే స్థిరపడిపోయాడు. నగరంలోని కరీమాబాద్‌ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉండేవారు. లాక్‌డౌన్‌ కారణంగా వరంగల్‌ నుంచి రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో గొర్రెకుంట గోదాం కు తరలివెళ్లాడు. గోదాం పక్కనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్‌తో పాటు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. భర్తతో విడిపోయిన కుమార్తె బుస్రా ఆలం కూడా తన మూడేళ్ల కుమారుడితో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. గోదాం పక్కనే ఉన్న పై భవనంలో బిహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాంలు ఉంటున్నారు.

అయితే ఈ హత్యను నగర పోలీసు కమిషనర్ రవీందర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తొమ్మిది దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. హత్య జరిగిన మరుసటి రోజు నుంచే కేసులో పురోగతి కన్పించినప్పటికీ వివరాలు బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

You might also like