FbTelugu

ముస్లింల మానవత్వం… హిందువులకు దహన సంస్కారాలు

అనంతపురం: కరోనా  పాజిటివ్ తో చనిపోయిన కొందరి హిందువుల పరిస్థితి దయనీయంగా ఉంది. కట్టుకున్న భార్య, కుమారుడు, బంధువులు, కుటుంబ సభ్యులు అనాధ శవంలా వదిలేసిపోతున్నారు.

మానవత్వం మంటకలిపే విధంగా కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నా కొందరు ముస్లిం యువకులు ముందుకు వచ్చి హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మదిగుట్బకు చెందిన కృష్ణమ్మ (65)కరోనాతో పోరాడుతూ చివరకు కన్నుమూసింది. ఆమె అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. ఈ విషయాన్ని ఇస్లామిక్ హెల్పింగ్ హ్యాండ్స్ కు తెలియచేశారు. ఆ సంస్థ ప్రతినిధులు అమీర్, బాబా, అదిల్, తలహా, సుజార్ లు ముందుకు వచ్చి హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు.

కదిరి రూరల్ మండలం నాగూరుపల్లి వాసి ఆంజనేయులు (45) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. జ్వరం లక్షణాలు కన్పించడంతో బుధవారం స్థానిక కమ్యునిటీ హెల్త్ సెంటర్ కు వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. ఆసుపత్రి బయటే అరుగుపై కూర్చుని మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయాడు. ఈ విషయాన్ని భార్య, కుమారుడికి తెలపగా వారు చేరుకుని, మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయారు. అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా డాక్టర్ రామకృష్ణ సూచించినా వారు పట్టించుకోలేదు. 20 గంటల పాటు మృతదేహం అక్కడే ఉంది. ఒడి చెరువుకు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సభ్యులు ఆంజనేయులుకు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

కదిరి మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్ల నివాసి ఒకరు కరోనా పాజిటివ్ తో చనిపోయారు. వైరస్ తమకూ సోకుతుందనే భయంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించలేదు. ఈ విషయం తెలుసుకున్న కదిరి పట్టణానికి చెందిన నిజాం వలీ, ఇర్ఫాన్ ఖాన్, ఆషిక్, సాదిక్ బాషా, అక్బర్ ఖాన్, ఇర్షాద్ అక్కడికి చేరుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు పూర్తి చేశారు. వారం రోజుల క్రితం కూడా ఒక వ్యక్తికి ఇదే విధంగా నిర్వహించారు. ఈ దహన సంస్కారాలన్నీ స్వంత ఖర్చులతోనే ముస్లిం యువకులు నిర్వహిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.