హైదరాబాద్: తనకు తెలియకుండా బయటకు వెళ్లి వస్తున్న భార్యను నిలదీసినా సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహించిన భర్త కత్తితో పొడిచి చంపాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాయదుర్గం పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర కు చెందిన పర్హాన ఖురేషీ (25) కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. రెండు పెళ్లిళ్ల ద్వారా ఆమెకు ముగ్గురు సంతానం కలిగారు. ఇద్దరు భర్తలను వదిలేసి మహారాష్ట్ర నాందేడ్ లో ఉండగా కర్ణాటక రాష్ట్ర బీదర్ కు చెందిన మోసిన్ ఖాన్ (31)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఏడాది పాటు సహజీవనం చేశారు. ఐదు నెలల క్రితం వివాహం చేసుకున్న వీరు రాయదుర్గం పరిధిలోని అంజయ్య నగర్ లో నివాసం ఉంటున్నారు.
కొద్ది రోజులుగా మోసిన్ కు తెలియకుండా పర్హాన బయటకు వెళ్లి వస్తుండేది. ఎక్కడికి వెళ్లి వస్తున్నావని అడిగితే సరైన సమాధానం చెప్పేది కాదు. దీంతో అనుమానం పెంచుకున్న మోసిన్ ఆమెను బుధవారం నాడు నిలదీశాడు. రూ.10 లక్షలు చెల్లిస్తే విడిచి వెళ్తానని స్పష్టం చేయడంతో ఆగ్రహించిన మోసిన్ కూరగాయల కత్తితో కడుపులో పొడిచాడు. ఆ తరువాత ఆమె గొంతు కోయడంతో తీవ్రంగా రక్తస్రావమైంది. ఉస్మానియా హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం నాడు మృతి చెందింది.