FbTelugu

మున్సిపాల్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి…

అమరావతి: పలు కారణాలతో పెండింగ్ లో ఉన్న 37 మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ సన్నాహాలు చేస్తున్నది.

రాష్ట్రంలో మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు కలిపి మొత్తం 125 ఉండగా ఇటీవల 87 చోట్ల ఎన్నికలు నిర్వహించారు. కాకినాడ కార్పొరేషన్‌కు 2017లోనే ఎన్నికలు జరిగాయి. మిగతా శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, నెల్లూరు కార్పొరేషన్లతో సహా 37 కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పెండింగ్‌ పనుల్ని వచ్చేనెల 15 నాటికి పూర్తిచేయాలని మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించింది. సత్వరమే షెడ్యూలు ప్రకారం ఓటర్ల జాబితాలను రూపొందించాలని, అవసరమైనచోట వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తిచేయాలని సూచించింది.

ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రతిపాదనలను రూపొందించాలని స్పష్టం చేసింది. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించమని ఆదేశించింది. సమీప గ్రామాలను విలీనం చేయడంపై ఉన్న వ్యాజ్యాలను త్వరగా పరిష్కరించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. 37 కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా అందుకు సంసిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.