FbTelugu

ఇకనుంచి మున్సిపల్ సిబ్బంది జరిమానాలు

కార్యాచరణ.. తక్షణమే అమల్లోకి

అమరావతి: మాస్క్ లేకుండా బయటకు వస్తే పోలీసు, రెవెన్యూ అధికారులతో పాటు మున్సిపల్ అధికారులు జరిమానా వేయనున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించకున్నా జరిమానాల మోత మోగించనున్నారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రతి దుకాణంలో థర్మల్‌ స్కానర్లు, శానిటైజర్ల వాడకాన్ని తప్పనిసరి చేశారు. పాటించని వారికి నోటీసుల జారీ, భారీ జరిమానాలు, దుకాణాల మూసివేత వంటి చర్యలు తీసుకుంటారు.

రాష్ట్రంలోని 110 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో తక్షణమే ఇది అమల్లోకి రానుంది. నిత్య పర్యవేక్షణ ద్వారా కరోనా కట్టడి నియమావళిని అతిక్రమించే వారిని ఎప్పటికప్పుడు గుర్తించి, అపరాధ రుసుములు విధించడం సహా వివిధ చర్యలు తీసుకోనుంది.  ఈ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యతను మున్సిపల్‌ కమిషనర్లపై ఉంచారు. ఈ అంశాలపై ప్రతి రోజూ నివేదికలను సమర్పించాల్సిందిగా కమిషనర్లను ఉన్నతాధికారులు ఆదేశించారు.

కరోనా వ్యాప్తిలో చిన్న దుకాణాలూ కీలక పాత్ర పోషిస్తున్నాయని భావిస్తున్న ఉన్నతాధికారులు నిబంధనలు కఠినతరం చేశారు. ఇకపై అన్ని దుకాణాల్లోనూ, బయట  కొనుగోలుదారులూ కచ్చితంగా 6 అడుగుల భౌతిక దూరం పాటించేలా వ్యాపారులు చూడాలి. నిబంధనలు పాటించని వ్యాపారులపై మున్సిపల్‌ కమిషనర్లకు ప్రజలు  తెలియజేయాలి.

నిర్మాణ స్థలాల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద ప్రతి ఒక్కరికీ కచ్చితంగా థర్మల్‌ స్ర్కీనింగ్‌ జరపాలి. హ్యాండ్‌ శానిటైజర్లు ఏర్పాటు చేయాలి. ప్రదేశాల్లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలి. కార్మికులు చేతి గ్లవుజ్‌లు వాడేలా చూడాలి. గుట్కా, తంబాకు, కిళ్లీల వంటివి ఉమ్మి వేయడం పూర్తిగా నిషేధించారు.

You might also like