ఢిల్లీ: దేశంలో కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా అస్తవ్యస్థమైన ప్రజా జీవన వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుత సమయంలో దేశ ఆర్థిక వృద్ధి పతనం అయిన నేపథ్యంలో కాపాడాల్సింది మధ్యతరగతి ప్రజలను కాదని ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు)లకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులు స్వస్థలాలకు వెళ్లినందువలన ఆర్థిక వ్యవస్థపై పడే భారం తక్కువేనని అంచనావేశారు.
దేశంలో వివిధ రంగాల్లో పనిచేసే వలస కార్మికులు సుమారు 5 కోట్లమంది ఉన్నారని వారిలో ప్రస్తుతం సుమారు 70 లక్షల మంది మాత్రమే స్వస్థలాలకు వెళ్లారని అంచనా వేశారు. దాదాపు 3 కోట్ల మంది కూలీలు అందుబాటులో ఉంటారని అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊతం ఇవ్వాలని సూచించారు.