FbTelugu

మిలిటరీ ఆస్పత్రిలో ఎంపి రాజు

హైదరాబాద్ : వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణంరాజును సోమవారం రాత్రి 11.00 గంటల సమయంలో సికింద్రాబాద్‌లోని మిలిటరీ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
ఆస్పత్రి చెక్‌పోస్ట్‌ వద్ద రాజు ఎస్కార్ట్‌ వాహనం దిగి మిలిటరీ అంబులెన్స్‌లో ఎక్కే సమయంలో కొంత ఇబ్బంది కి గురయ్యారు. శరీరం సహకరించక పోవడంతో అక్కడే కూర్చుండి పోయారు. ఆయన పరిస్థితి గమనించిన ఆర్మీ ఆధికారులు సహకరించి అంబులెన్స్‌లో ఎక్కేందుకు సహకరించారు. అప్పటికే ఎంపి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొన్నారు. సిఐడి అధికారుల అనుమతితో కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. తప్పక న్యాయం గెలుస్తుంది.. ధైర్యంగా ఉండండంటూ కుటుంబ సభ్యులకు రఘురామ భరోసా ఇచ్చారు. అక్కడే ఉన్న మీడియాతో రఘురామ మాట్లాడే ప్రయత్నం చేయగా.. అధికారులు నిరాకరించారు. ఏపిలో తనకు ప్రాణహాని ఉందని అన్నారు. విచారణ పేరుతో తనను ఎపి సిఐడి అధికారులు పలుమార్లు కొట్టారని కోర్టుకు విన్నవించుకోవడంతో, మిలటరీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అని ఆయన చెప్పారు.

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు జ్యుడీషియల్‌ అధికారి సమక్షంలో మిలిటరీ ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యనిపుణుల బృందం ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించనున్నది. వైద్య పరీక్షలు చేస్తున్న సమయంలో వీడియో తీసి కోర్టుకు సమర్పించనున్నారు. ఎంపి అభిమానులు ఆస్పత్రి వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఆస్పత్రి ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.