FbTelugu

కెసిఆర్ ఏడుస్తుంటే నేనే ఓదార్చా: గాదె ఇన్నయ్య

హైదరాబాద్: నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో కె.చంద్రశేఖర్ రావు మంత్రి పదవి పీకేస్తే ట్రాన్స్ పోర్టు భవన్ లో ఏడుస్తూ కూర్చోగా నేనే ఓదార్చానని ఉద్యమ సహచరుడు గాదె ఇన్నయ్య స్మరించుకున్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నగరంలో జరిగింది. ఈ సమావేశానికి మాజీ మండలి చైర్మన్ కె.స్వామి గౌడ్ తో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఒకప్పటి కెసిఆర్ సహచరుడు గాదె ఇన్నయ్య మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ ను కంటికి రెప్పలా కాపాడుకున్నామన్నారు. ఉద్యమం ఆకాంక్ష ఏమిటో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. సిద్దిపేట నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా మావోయిస్టుల నుంచి కెసిఆర్ ను కాపాడామన్నారు. ప్రత్యేక రాష్ట్రం సిద్దించిన తరువాత కెసిఆర్ అరాచక పాలన చేస్తున్నారని ఆయన విమర్శించారు.

హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ కు ఉద్యమకారులందరం మద్దతిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈటల గెలుపుతో ప్రజాస్వామిక తెలంగాణ నెలకొల్పుతామని గాదె ఇన్నయ్య తెలిపారు.
ఈటల రాజేందర్ కోసం హుజూరాబాద్ లో ఉద్యమకారులు పనిచేస్తారని బిజెపి నేత ఏ.చంద్రశేఖర్ అన్నారు. దళితులతో రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. హుజూరాబాద్ లో త్వరలో ఉద్యమకారులతో భారీ సభ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కెసిఆర్ పాలనలో ప్రజాస్వామ్యం మంటగలిసిందని, ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. వచ్చే సమావేశంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ పాల్గొంటారని అన్నారు. ఉద్యమకారులు ఈటల ఎన్నికను అవకాశంగా తీసుకోవాలని, ఉద్యమాకారులను ఏకం చేస్తున్నామని స్వామి గౌడ్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.