ఖమ్మం : త్వరలోనే కూతురి పెళ్లి జరగాల్సి ఉండగా.. తల్లీ కూతురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలోని గాంధీచౌక్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక గాంధీ చౌక్ లో నివాసం ఉంటున్న గోవిందమ్మ, ప్రకాశ్ లు భార్యాభర్తలు.
వీరికి ఇద్దరు కూతుళ్లు రాధిక, రమ్య ఉన్నారు. ప్రకాశ్ బంగారం మెరుగు పెట్టే పనిచేస్తున్నాడు. కాగా ఇటీవలే పెద్దకూతురికి వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలోనే నిన్న తల్లీ కూతురు కెమికల్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పనికి వెళ్లొచ్చిన ప్రసాద్ ఇది గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. కూతురి పెళ్లికి డబ్బు సమకూరలేదన్న మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.