FbTelugu

ఐదుకు కాదు.. ఫస్టుకే..

భానుడు భగభగలాడుతున్నాడు. చండప్రచండంగా విజృంభిస్తున్నాడు. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నాడు. దేశంలో 50 డిగ్రీల సెల్సియస్‌ దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఉదయం ఎనిమిది గంటలకే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. వడదెబ్బకు అనేకమంది పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న దేశవాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళకు రానున్నాయని తెలిపింది. అనుకున్న దానికంటే ముందుగానే ఇవి వస్తున్నాయట. సో, మరో నాలుగు రోజుల్లో భానుడి ప్రభావం తగ్గే అవకాశాలు ఉన్నాయట. ఎండలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది మంచి శుభవార్తే కదా.

వాస్తవానికి రుతుపవనాలు కేరళకు జూన్‌ 5న వస్తాయని తొలుత అంచనా వేసినప్పటికీ.. బంగాళాఖాతంలో తుఫాను సంచారంతో వేగం పుంజుకున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణం అనుకూలిస్తే 6, 7 తేదీలకల్లా రాయలసీమకు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. కాగా, విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో బలమైన గాలులు, ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో రానున్న మూడు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

You might also like