FbTelugu

పక్కా ప్లాన్ తోనే వైసీపీ నేత హత్య: ఎస్పీ రవీంద్రనాథ్

మచిలీపట్నం: మార్కెట్ కు వచ్చిన వైసీపీ నాయకుడు, రౌడీ షీటర్ మోకా భాస్కర రావు ను పక్కా ప్లాన్ తో చంపేశారని కృష్ణా జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు తెలిపారు.
మంత్రి పేర్ని నాని అనుచరుడు మోకా హత్య కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర భాగస్వామి అని, ప్రధాన నిందితుడు కొల్లు అనుచరుడు నాంచారయ్య ఎస్పీ చెప్పారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, మోకా భాస్కర రావు హత్య కు దారితీసిన పరిస్థితులు ఇవాళ మీడియాకు వివరించారు. ప్రధాన నిందితుడి నాంచారయ్య, మోకా కు మధ్య కొన్నేళ్లుగా తీవ్ర విభేధాలు ఉన్నాయన్నారు.

హత్యాకాండంలో మొత్తం ముగ్గురు పాల్గొన్నారని, మరికొందరు కూడా పరోక్షంగా సహకరించారన్నారు. తన పేరు ఎక్కడా రావద్దని కొల్లు చెప్పారన్నారు. ప్లాన్ మిస్ అవ్వకూడదని కొల్లు నిందితులకు చెప్పాడన్నారు.
హత్య జరిగిన తరువాత నాంచారయ్య వేరే ఫోన్ నెంబర్ తో కొల్లు రవీంద్ర పీఏ తో మాట్లాడారు. పీఏ ఫోన్ ద్వారా రవీంద్ర అతనితో మాట్లాడారని ఎస్పీ వివరించారు. పని అయిపొయిందా అని అడిగారన్నారు. నిందితుల కాల్ డేటాను పరిశీలించామన్నారు. కొల్లు రవీంద్రను అరెస్టు చేసి జడ్జీ ముందు ప్రవేశపెట్టామన్నారు.
ఆధిపత్య పోరులోనే హత్య జరిగిందని, 2013 నుంచే మోకా హత్యకు ప్రణాళిక వేస్తున్నారని ఎస్పీ అన్నారు. గత నెల 28న మొదటి సారి ప్రయత్నించగా అమలు కాలేదని మరుసటి రోజు అనగా 29న పక్కా ప్లాన్ తో చంపేశారని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు.

You might also like