FbTelugu

రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన మోదీ

స్వదేశీ వస్తువులనే కొనాలి

21వ శతాబ్దం మనదే

లాక్ డౌన్ పొడగింపుపై ప్రకటన లేదు

హైదరాబాద్: ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే లాక్ డౌన్ పొడగింపుపై ప్రధాని ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ ఆర్థిక ప్యాకేజీ జీడీపీ పెరుగుదలకు ఉపకరిస్తుందని, కార్మికులు, రైతులు, పన్ను చెల్లింపుదారులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కాటన్ పరిశ్రమలకు ఎంతగానో లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కరోనావైరస్‌ మహమ్మారికి సంబంధించి ఇవాళ ఐదోసారి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశం నేడు అన్ని రంగాల్లో సత్తాను చాటుకుంటోందన్నారు. స్వయం సమృద్ధి సాధించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. కరోనా సమయంలో భారతీయ ఔషధాలు ఎంతో ప్రభావవంతంగా పని చేస్తున్నాయి. డిమాండ్ – సప్లై మధ్య బంధం తెగకుండా చర్యలను ఇప్పటికే ప్రారంభించామన్నారు. 21వ శతాబ్దం మనదేనని, ఆత్మ నిర్భర భారతదేశమే మన లక్ష్యమన్నారు.

ఒక్క కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్నీ సమస్యల్లోకి నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితినీ ఎప్పుడూ చూడలేదు, కనీసం వినలేదు కూడా అని నరేంద్ర మోదీ అన్నారు. కరోనావైరస్‌పై ప్రపంచ పోరాటం నాలుగు నెలలుగా సాగుతోంది. కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోందని, కోట్లాది ప్రజల జీవితాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయన్నారు. యావత్తు ప్రపంచం ఒక రకమైన యుద్ధం చేస్తోందని గద్గద స్వరంతో అన్నారు.

ఇదివరకు ఇలాంటి సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదు, కనీసం వినలేదని చెప్పారు. మానవ జాతి ఇదివరకెప్పుడూ ఊహించని భయంకర ఉత్పాతమిది అని పేర్కొన్నారు. కానీ, అలసిపోవడం, ఓడిపోవడం, వెనుకంజ వేయడం మనుషులు సహించరన్నారు.

మనల్ని మనం కాపాడుకోవాలి, మరింత పట్టుదలతో ముందుకు సాగాలి. మన దేశంలో తయారయ్యే ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని, మేడ్ ఇన్ ఇండియా ద్వారా తయారయి వస్తువులను కొనాలన్నారు. మున్ముందు సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రతి రోజూ 2 లక్షల పీపీఈ కిట్లు, 2 లక్షల ఎన్95 మాస్కులు తయారుచేస్తున్నామని వివరించారు. మన సంకల్పం ఈ సంక్షోభం కన్నా గొప్పది. 21వ శతాబ్దం భారతదేనని మనం గత శతాబ్దం నుంచి ఎప్పుడూ వింటూ ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు.

అయితే లాక్ డౌన్ పొడగింపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నెల 17వ తేదీతో మూడో దశ లాక్ డౌన్ ముగియనుంది. ఆ లోపు మరోసారి పొడగింపుపై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.