FbTelugu

ఓడిపోయే భగత్ కు టికెట్ ఇచ్చారు: రేవంత్ రెడ్డి

నాగార్జున‌సాగ‌ర్: అన్ని స‌ర్వేల్లో ఓడిపోతార‌ని తెలిశాక నోముల భ‌గ‌త్‌కు సిఎం కెసిఆర్ టికెట్ ఇచ్చారని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎవ‌రైనా ప్ర‌జాప్ర‌తినిధి చ‌నిపోతే ఏక‌గ్రీవం చేసేవారన్నారు.

గత ముఖ్యమంత్రులు వైఎస్.రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ఎన్.చంద్ర‌బాబునాయుడు బద్ద శ‌త్రువులైనా అదే సాంప్రదాయం కొన‌సాగించారని రేవంత్ రెడ్డి కితాబునిచ్చారు. అధికార దాహంతో తెలంగాణ‌లో కేసిఆర్ నాటి సాంప్ర‌దాయాల‌ను తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఇవాళ నాగార్జున సాగర్ లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నోముల నర్సింహ్మయ్య చ‌నిపోతే సానుభూతి ఓట్ల‌తో గెలిచేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నారు. టిఆర్ఎస్‌లో చేరిన త‌ర్వాతే రాజ‌కీయంగా క‌నుమ‌రుగై పోయారు. ఏనాడు నోముల‌కు శాస‌న‌స‌భ‌లో మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌లేదని, గొంతు నొక్కిందే కేసిఆరేనని ఆరోపించారు. నర్సింహ్మయ్య చ‌నిపోతే ఆ కుటుంబానికి టికెట్ ఇవ్వ‌కుండా ఉండేందుకు స‌ర్వేలు చేయించారు. నోముల కుటుంబాన్ని అవ‌మానించిందే కేసిఆర్ అని రేవంత్ రెడ్డి అన్నారు.

నోముల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంద‌ని తెలిసే టికెట్ ఇచ్చారు. రేప‌టి స‌భా కోసం ఎన్నిక‌ల నిబంధ‌నలు, క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘించారన్నారు. కోవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆరు వేల మందితో బహిరంగ స‌భ పెట్టుకోవాల‌ని నిబంధనలు పెడితే ఎన్నిక‌ల కమిషన్ ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. ఒక ల‌క్ష మందితో స‌భ పెడుతామంటూ బ‌హిరంగ ప్ర‌క‌టిస్తే ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్ర‌క‌ట‌న వెనక్కి వెళ్లితే దిక్కులేని ప‌రిస్థితుల్లో కేసిఆర్ తలొంచుకుని కె.జానారెడ్డి ఇంటికి వెళ్ల‌లేదా అని నిలదీశారు. జానారెడ్డి ఇంట్లో అన్ని పార్టీలు, అన్ని సంఘాల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి, స‌మ‌న్వ‌యం చేసుకొని తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చారన్నారు. రాష్ట్రానికే పెద్ద‌దిక్కుగా  ఉన్న జానారెడ్డి ఓడించాల్సిన అవ‌స‌రం ఏముందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

కెసిఆర్ ఏడేళ్ల పాల‌న‌లో బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే, బిఆర్.అంబేద్క‌ర్ ‌వ‌ర్థంతి, జ‌యంతి కార్యక్రమాలు ఏనాడు హాజరు కాలేదన్నారు. ద‌ళితుల‌కు యేటా 10 వేల కోట్లు ఖ‌ర్చు పెడుతామ‌న్నారు కానీ అందులో 5 శాతం కూడా ఖ‌ర్చు చేయ‌లేదన్నారు. గిరిజనులు, ద‌ళితులంటే కేసీఆర్‌కు చిన్న‌చూపన్నారు. నెక్లెస్ రోడ్డు జంక్షన్ లో బిఆర్.అంబేద్క‌ర్ 125 అడుగుల విగ్ర‌హం ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి నాలుగేళ్లు అయింది, అడుగు ముందుకు పడలేదన్నారు. రేపు అంబేద్క‌ర్‌కు నివాళి అర్పించిన త‌ర్వాతే కేసిఆర్ సాగ‌ర్‌కు రావాలన్నారు. అలా చేయకుంటే ద‌ళితులు రేప‌టి కేసిఆర్ బహిరంగ సభను  బ‌హిష్కరించాని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.